Amaravati Real Estate : అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌.. ఎక్కువ మంది వీటిపైనే పెట్టుబడి పెడుతున్నారట!-investments in luxury villas are increasing in amaravati real estate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Real Estate : అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌.. ఎక్కువ మంది వీటిపైనే పెట్టుబడి పెడుతున్నారట!

Amaravati Real Estate : అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌.. ఎక్కువ మంది వీటిపైనే పెట్టుబడి పెడుతున్నారట!

Basani Shiva Kumar HT Telugu
Nov 02, 2024 11:01 AM IST

Amaravati Real Estate : ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌ క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో.. భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కువ మంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెడుతున్నారు.

అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌
అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం.. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభం కావడమేనని చెబుతున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదు. కానీ.. గిడిచిన రెండు నెలలుగా భూ క్రయవిక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి.

అమరావతి ప్రాంతంలో భూమి లేని వారు కొత్తగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి భూమిని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ- గుంటూరు మధ్యలో భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కృష్టా నది తీరం వెంట భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరం రూ.30 లక్షలు ఉంటే.. ఇప్పుడు మూడింతలు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇక్కడ భూములు ఉన్నవారు ఇప్పుడు ఎక్కువగా లగ్జరీ విల్లాలపై ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీ విల్లాలు నిర్మించి విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువమంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్టర్లతో అగ్రిమెంట్ చేసుకొని.. విల్లాల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుందని ఆశిస్తున్నారు.

అమరావతికి సమీపంలో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం కూడా అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆయా పరిసరాల్లో ఇళ్ల ప్లాట్ల ధరలు కూడా పెరిగిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెంటున్నర స్థలం రూ.13 లక్షలు చెప్పిన వారు.. ఇప్పుడు రూ.20 లక్షల పైనే చెబుతున్నారు.

ఓఆర్ఆర్‌తో..

అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఇటీవలే ఆమోదం తెలిపింది. కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం జరగనుంది. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది. దీని కారణంగా కూడా భూములకు ధరలు పెరిగాయి. ఆర్థికంగా ఇబ్బందిలేని రైతులు కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇవే కాకుండా రాజధానిలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను నిర్మించే అవకాశం ఉంది. అటు ప్రైవేట్ సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో భూములు కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు చదును చేసి.. మళ్లీ వ్యాపారం మొదలుపెట్టారు.

Whats_app_banner