Amaravati Drone Summit 2024 : అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభం, ఇవాళ సాయంత్రం 5500 డ్రోన్లతో ప్రదర్శన
Amaravati Drone Summit 2024 : అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో 6929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ డ్రోన్ సమ్మిట్ ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్రోన్ సమ్మిట్ కు కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహించనున్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ లో 6,929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
జాతీయ స్థాయిలో జరిగి ఈ సదస్సులో తొమ్మిది ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర డ్రోన్ పాలసీ ముసాయిదా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. డ్రోన్ల రంగంలో ఏపీని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయానశాఖ, డీఎఫ్‌ఐ, సీఐఐ భాగస్వామ్యంతో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణా నదీతీరంలో 5,500 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం గం.6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రోన్ల ప్రదర్శన కానుందని నిర్వాహకులు చెబుతున్నారు. అర కిలోమీటరు ఎత్తులో ఏడు ఆకృతులను డ్రోన్లతో ఆవిష్కరించనున్నారు.
డ్రోన్ సమ్మిట్ గేమ్ ఛేంజర్
డ్రోన్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇవాళ అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్, ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. 1995లో కొత్తగా వస్తున్న ఐటీని అందిపుచుకున్నామని, దాని ఫలితమే నేడు ఐటీ రంగంలో తెలుగు వాళ్లు ముందున్నారన్నారు. ఒక విజన్ తో అనుకున్నది సాధించామన్నారు. టెలీ కమ్యూనికేషన్ సెక్టార్ పై కూడా చొరవ చూపించామన్నారు. భారతీయలు ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని, అవకాశాలు సృష్టించుకోవటంలో ఏపీ ప్రభుత్వం ముందుంటుందన్నారు.
"వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలకపాత్ర. నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు వాడవచ్చు. భవిష్యత్తులో వైద్య రంగంలో పెనుమార్పులు రానున్నాయి. భవిష్యత్తులో రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయి. మేం మాత్రం అభివృద్ధి కోసం డ్రోన్లు వాడతాం. డ్రోన్ల వినియోగంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెడతాం. శాంతిభద్రతల పరిరక్షణకు డ్రోన్లు వినియోగిస్తాం. డ్రోన్లతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చు. పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తాం. ఇప్పుడు నిజమైన సంపద అంటే "డేటా". డేటా సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మరింత అభివృద్ధి చెందనున్నాయి. డిజిటల్ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్" - సీఎం చంద్రబాబు