Amaravati Capital : అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ-cm chandrababu restarted amaravati capital works at crda office assured visakha development ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Capital : అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ

Amaravati Capital : అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ

Bandaru Satyaprasad HT Telugu
Oct 19, 2024 03:12 PM IST

Amaravati Capital : అమరావతిలో రాజధాని పనులు సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ ఆఫీసు పనులను ప్రారంభించారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ
అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడడంతో అమరావతి రాజధాని మళ్లీ ఊపిరిపోసుకుంది. వైసీపీ హయాంలో మూడు రాజధానులు ప్రకటించడంతో...అమరావతి రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. 2024లో కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో... అమరావతి రైతుల పోరాటం ఫలించినట్లైంది. అయితే గత ఐదేళ్లుగా అమరావతి పనులు ఆగిపోవడంతో...రాజధాని ప్రాంతం జంగిల్ గా మారింది. దీంతో కొత్త ప్రభుత్వం ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. ఇటీవల ఈ పనులు పూర్తిచేసింది. తాజాగా అమరావతిలో పనులు పునః ప్రారంభం అయ్యాయి.

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ ఆఫీసు పనులను ప్రారంభించారు. సీఆర్డీఏ భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజలు నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.160 కోట్లతో ఏడంతస్తులు సీఆర్‌డీఏ ఆఫీసు పనులు చేపట్టారు. 2017లో ఈ పనులు ప్రారంభం కాగా... వైసీపీ పాలనలో పనులు ముందుకుసాగలేదు. మొత్తం 3.62 ఎకరాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దామన్నారు. అప్పట్లోనే సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు నిర్మాంచామన్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులను ఒప్పించి, రాజధాని కోసం 54 వేల ఎకరాలు సేకరించామన్నారు.

విశాఖ ఆర్థిక రాజధాని

అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఆర్డీఏ ఆఫీస్ ది బెస్ట్ గా ఉండాలన్నారు.

"అమరావతి మునిగిందని జగన్ ఫేక్ ప్రచారం చేశారు. చివరకు నిన్న వచ్చిన బెంగుళూరు వరదల్లో, ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే, మనమే నాశనం అవుతాం, గుర్తుపెట్టుకో జగన్. గడిచిన 5 ఏళ్లలో, జగన్ అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది, అమరావతి మహిళలని. వైసీపీపై రాణి రుద్రమదేవి కంటే ఎక్కువ పౌరుషంగా మహిళా రైతులు పోరాడారు" -సీఎం చంద్రబాబు

"విజన్ 2020 అని నాడు నేను పని చేస్తే, నన్ను 420 అన్నారు. నన్ను అన్న వాళ్ళు 420లుగా మిగిలిపోయారు కానీ, నా విజన్ కార్యరూపం దాల్చింది. ఇప్పుడు విజన్ 2047తో ముందుకు వెళ్తున్నాం. నేను చెప్పే విజన్ ఏంటో, ఈ 420లకు అర్థం కాదు. ఈ రాష్ట్రాన్ని ఇంకా భూతం పట్టుకుని వేలాడుతుంది. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తూనే, ఆ భూతాన్ని శాశ్వతంగా వదిలించుకోవాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎన్నికల ముందు పిలుపునిచ్చా. ప్రజలు ఆశీర్వదించారు. రాజధాని పనులు ప్రారంభిస్తున్నాం, మరో రెండు వారాల్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం" - సీఎం చంద్రబాబు

Whats_app_banner

సంబంధిత కథనం