AP Cabinet : ఈనెల 10న ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!
ఈనెల 10వ తేదీన ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఉచిత గ్యాస్ వంటి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వాలంటీర్ల జీతాలతో పాటు రాజధాని నిర్మాణ పనులపై చర్చించనున్నారు.
ఈనెల 10 తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రి వర్గం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది.
ఈ వంద రోజుల్లో పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభమే జరిగింది. దీనికి సంబంధించి ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. అయితే అది పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కేవలం ఇంటింటికి స్టిక్కర్లు అంటింపు, కరపత్రాలు పంపిణీకే పరిమితం అయ్యారు. రాష్ట్రంలో లడ్డూ రాజకీయంలో అది కొట్టుకుపోయింది.
ఈనెల 10న అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్‌లోని కేబినేట్ హాల్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కేబినెట్ హ్యాండ్ బుక్ ఫార్మేట్ రూపంలో ప్రతిపాదనలను తయారు చేసి ఈనెల 8 మంగళవారం సాయంత్రం 4 గంటల కల్లా పంపాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వంద రోజుల్లో పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్లు తప్ప మిగిలిన సూపర్ సిక్స్ అంశాలు ఒక్కటి కూడా ప్రస్తావనే లేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది.
కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్…!
ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీంతో దీపావళికి సూపర్ సిక్స్‌లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామని ఇప్పటికే కర్నూలు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కనుక రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో మహిళలకు ఉచిత గ్యాస్ అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే మహాత్మా గాంధీ జయంతి రోజున సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో మాట్లాడుతూ చెత్త పన్ను రద్దు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశించారు. దీనిపై కూడా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే జల్ జీవన్ మిషణ్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి పునఃనిర్మాణం వంటి అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరగనుంది.
మరోవైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు గౌరవవేతనం రూ.10 వేలు ఇస్తామని, ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు.
గత నాలుగు నెలలుగా వాలంటీర్లకు జీతాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి, ఆందోళనలు చేపడతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కర్నూలు పర్యటనలో సీఎం చంద్రబాబు వాలంటీర్ల అంశంపై స్పందించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేమని అన్నారు. కానీ ఇప్పుడు పెన్షన్ పంపిణీ బ్రహ్మాండంగా జరుగుతోంది. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచన చేస్తున్నామని అన్నారు. దీంతో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో వాలంటీర్ల అంశంపై కూడా చర్చ జరుగునుంది.
సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. బందర్‌లో పర్యటించిన సీఎం చంద్రబాబు ‘P4’ అంటే ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్’ అంశంపై మాట్లాడారు. ఇప్పటి వరకు P3 (పబ్లిక్, ప్రైవేట్ పార్లనర్‌షిప్) ఉండేది. కొత్తగా రాష్ట్రంలో P4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్) అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ అంశంపై కూడా రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరగనుంది. దీనికి కూడా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపాల్సి ఉంది.