Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న-visakhapatnam volunteers protest demands take them into duties pay pending salaries ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న

Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న

HT Telugu Desk HT Telugu
Sep 23, 2024 05:40 PM IST

Volunteers Protest : ఏపీలో వాలంటీర్లు రోడ్డెక్కారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాలంటీర్లు ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు అందించారు.

ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న
ఏపీలో వాలంటీర్లు పోరు బాట, విధుల్లోకి తీసుకోవాలని ఆందోళ‌న

Volunteers Protest : రాష్ట్రంలో వాలంటీర్లు పోరుబాట ప‌ట్టారు. త‌మ‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని, భద్రత, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళ‌న చేప‌ట్టారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ‌, వార్డు వాలంటీర్స్ యూనియ‌న్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతోన్నాయి.

సోమ‌వారం విశాఖ‌ప‌ట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వ‌ద్ద వాలంటీర్లు క‌దంతొక్కారు. అక్కడ ఆందోళ‌న చేస్తూ వాలంటీర్లను కొన‌సాగించాల‌ని నినాదాలతో హోరెత్తించారు. అనంత‌రం క‌లెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎం.ఎన్ హరేంధీర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళ‌న‌ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం మీడియా ఎదుట తమ సమస్యలతో త‌మ గోడును వినిపించారు.

వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు. తాము అడగకుండానే పదివేలు జీతం ఇస్తామన్నారని, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామన్నార‌ని తెలిపారు. టీడీపీ నేతలు మాటలు విని వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా కూడా చేయలేద‌ని అన్నారు. అధికారంలోకి వ‌చ్చి వంద రోజులు దాటిన వాలంటీర్లు గురించి పట్టించుకోలేదని, ప్రజలకు సేవ చేయడం కోసం వాలంటీర్‌ వ్యవస్థను వైఎస్ జగన్ తీసుకువచ్చార‌ని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నార‌ని అన్నారు.

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా చింతూరు ఐటీడీఏ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఉద్యోగ భ‌ద్రత క‌ల్పించాల‌ని, బ‌కాయి వేత‌నాలు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ చింతూరులోని శ్యామ‌ల వెంక‌ట‌రెడ్డి భ‌వ‌నం నుంచి ఐటీడీపీ కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ చేపట్టారు. వీఆర్‌.పురం, కూన‌వ‌రం, ఎట‌పాక‌కు చెందిన వాలంటీర్లు ర్యాలీలో పాల్గొన్నారు. అనంత‌రం ఐటీడీఏ పీఓ అపూర్వ భ‌ర‌త్‌కు విన‌తి ప‌త్రం అందజేశారు. దీనికి పీఓ అపూర్వ భ‌ర‌త్‌ స్పందిస్తూ వాలంటీర్ల స‌మ‌స్య‌ల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన‌ని అన్నారు. వాలంటీర్ల ఆందోళ‌న‌కు సీపీఎం నేత‌, చింతూరు వైస్ ఎంపీపీ కొమ‌రం పెంట‌య్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యద‌ర్శి ప‌ల్లపు వెంక‌ట్‌, గిరిజ‌న సంఘం జిల్లా నేత సీసం సురేష్‌ మ‌ద్దతు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వాలంటీర్ల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా మారింద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేర‌కు వాలంటీర్లకు గౌర‌వం వేత‌నం రూ.10 వేలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌ర‌ద‌లు, క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా వాలంటీర్లు సేవ‌లందించార‌ని గుర్తు చేశారు.

ప‌శ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ముత్యాలపల్లి వాలంటీర్లు న‌ర్సాపురం ఎంఎల్ఏ బొమ్మిడి నారాయ‌ణ నాయ‌క‌ర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనకాపల్లిలో వాలంటీర్లు జీవీఎంసీ కమిషనర్, అనకాపల్లి కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్ కి తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే శాలరీస్ విడుదల చేయాలని చెప్పి వివరణ తీసుకుంటానని అన్నారు. క‌డ‌ప జిల్లా సిద్దవటం మండ‌లంలో ప‌ని చేసే వాలంటీర్లు ఎంపీడీవో జ‌వ‌హ‌ర్ బాబుకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండ‌లంలో వాలంటీర్లు టీడీపీ రాష్ట్ర నేత‌, పెద్దాపురం మాజీ వైస్ చైర్మన్ రాజా సూరిబాబుకి వినతిపత్రం స‌మ‌ర్పించారు.

వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల‌ని టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పాటు, జ‌గ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్వోతుల నెహ్రూ వంటి సీనియ‌ర్ నేత‌ల కూడా వాలంటీర్ వ్య‌వ‌స్థ వ‌ద్ద‌ని ముక్త‌కంఠంతో చంద్ర‌బాబుకు చెప్పారు. అలాగే ఈనెల 18న జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగారు.

గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగ‌స్టు 15న వాలంటీర్ల వ్యవ‌స్థను తీసుకొచ్చారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు, ప‌ట్ట‌ణాల్లో ప్రతి 75-100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రంలో 2,48,779 మంది వాలంటీర్లల‌తో గ్రామ‌, వార్డు వ‌లంటీర్ వ్యవ‌స్థను అమ‌లు చేసింది. ఒక్కో వాలంటీర్ త‌మ సేవ‌ల‌ను అందించినందుకు గానూ నెల‌కు రూ.5,000 వేత‌నం ఇచ్చేంది. వాలంటీర్లు త‌మ ప‌రిధిలోని ఇళ్లకు అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేసేవారు. తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేవారు.

వాలంటీర్లు ఈనెల 18న జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ స‌మావేశంలో త‌మ‌కు ఒక నిర్ణయం వెలువ‌డుతుంద‌ని ఆశించారు. కానీ మంత్రివర్గ స‌మావేశంలో వాలంటీర్ల అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోక‌పోగా, వాలంటీర్ల ప‌ద‌వీ కాలం ఏడాది క్రిత‌మే ముగిసింద‌ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెన్యూవ‌ల్ చేయలేద‌ని చంద్రబాబు అన్నారు. అయితే వాలంటీర్లకు ఏప్రిల్, మే నెలలు అంటే ఎన్నికలు జ‌రిగిన వ‌ర‌కు పూర్తిగా గౌర‌వ వేత‌నం అందింది. కొత్త ప్రభుత్వం అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పటి నుండే వారికి గౌర‌వ వేత‌నం అంద‌లేదు. దాదాపు నాలుగు నెల‌ల గౌర‌వ వేత‌నం పెండింగ్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని వాలంటీర్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం