Palasa Cashew: తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంకు ప‌లాస జీడిప‌ప్పు... 30 ట‌న్నుల లోడుకు జెండా ఊపి పంపిన మంత్రులు-palasa cashews for tirupati laddu prasad ministers flagged off 30 tons load ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palasa Cashew: తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంకు ప‌లాస జీడిప‌ప్పు... 30 ట‌న్నుల లోడుకు జెండా ఊపి పంపిన మంత్రులు

Palasa Cashew: తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంకు ప‌లాస జీడిప‌ప్పు... 30 ట‌న్నుల లోడుకు జెండా ఊపి పంపిన మంత్రులు

HT Telugu Desk HT Telugu
Sep 27, 2024 05:31 AM IST

Palasa Cashew: తిరుమల తిరుపత దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి సరఫరా చేయనున్నారు. 30టన్నుల లోడ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు జెండా ఊపి తిరుమలకు పంపారు.

జీడిపప్పు లారీలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
జీడిపప్పు లారీలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు

Palasa Cashew: రాష్ట్రంలో ఒక‌ప‌క్క శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదం తిరుప‌తి ల‌డ్డూపై వివాదం జ‌రుగుతోంది. మ‌రోవైపు తిరుప‌తి ల‌డ్డూ త‌యారీ నిర్విరామంగా జ‌రుగుతోంది. ఈ క్రమంలో లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి తరలిస్తున్నారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే భ‌క్తులు శ్రీ‌వారి ల‌డ్డూ మ‌హా ప్ర‌సాదంగా భావిస్తారు. తిరుమ‌ల వ‌చ్చిన శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని తీసుకుంటారు. తమ వారి కోసం దానిని తీసుకెళుతుంటారు.

టీటీడీ వేసిన బిడ్ శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస‌కు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ ద‌క్కించుకుంది. స్వామి వారి ద‌య వ‌ల్లే ఈ బిడ్ త‌మ‌కు ద‌క్కింద‌ని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్‌కుమార్ తెలిపారు.

శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ బుధ‌వారం పంపింది. దీంతో 50 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ తొలిసారి ప‌లాస నుంచి శ్రీ‌వారి ల‌డ్డుకి జీడిప‌ప్పు పంపుతున్నారు.

పలాస నుంచి తిరుమల వెళ్లే 30 ట‌న్నుల జీడిపప్పు వాహనానికి మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఇక నుంచి నాణ్యమైన జీడిపప్పు పలాస నుంచి వెళ్తుందని రాష్ట్ర ప‌శువ‌ర్ధ‌క శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ఐదేళ్ల అక్రమ పాలనలో నాణ్యత లేని జీడిపప్పు వినియోగించారని పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో నాణ్యమైన, రుచికరమైన లడ్డూ తయారీకి అనుగుణంగా పలాస ప్రాంతం నుంచి సరఫరా చేయనున్న జీడిపప్పు వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింద‌ని, మా ప్రాంతం జీడిపప్పు తిరుమల ప్రసాదంలో వాడడంపై ఆ ప్రాంత వాసిగా ఎంతో గర్వపడుతున్నాన‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు అన్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)