CM Chandrababu : దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు-kurnool cm chandrababu comments 3 free gas cylinder scheme start criticizes jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు

CM Chandrababu : దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Oct 01, 2024 06:18 PM IST

CM Chandrababu : దీపావళి నుంచి ఆడబిడ్డలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్ష అవ్వగానే, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు.

దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు
దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం - సీఎం చంద్రబాబు

CM Chandrababu : సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చినట్టు దీపావళి నుంచి ఆడబిడ్డలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సామాజిక పెన్షన్లు మొదటి తేదీనే ఇవ్వటమే కాదు, ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా మొదటి తేదీనే ఇస్తున్నామని స్పష్టంచేశారు. చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా, దేశంలోనే అత్యంత ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లా పుచ్చకాయలమాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.

బీసీలకు 10 శాతం మద్యం షాపులు

వైసీపీ పాలనలో జే-బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండులు పెట్టి, ప్రజల ప్రాణాలు తీశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వైసీపీ నేతల చేతిలో పెట్టుకుని, కోట్లు వెనకేశారన్నారు. అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామని, బీసీలకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. నాసిరకం బ్రాండులు కాకుండా, ప్రముఖ కంపెనీ బ్రాండులు తెచ్చి, క్వార్టర్ రూ.99 కే పెడుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే రూ.100 కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తామన్నారు.

"గత పాలకులు పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. మళ్లీ పోలవరం పనులు గాడిలో పెడుతున్నాం. పోలవరం పూర్తి చేసి, ఆ నీళ్ల పెన్నాకి అనుసంధానం చేసి, రాయలసీమ కరువుని అధిగమిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, మొత్తం భూములు కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఫిర్యాదుల్లో 50% భూ సమస్యలు పైనే వస్తున్నాయి. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి, మీ భూములు మీకే ఉండేలా రక్షించాం"- సీఎం చంద్రబాబు

వచ్చిన మొదటి రోజే మెగా డీఎస్సీపై సంతకం పెట్టి 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషవ్ విడుదల చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్ష అవ్వగానే, ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు. లూలు లాంటి సంస్థ మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందన్నారు. అటు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూనే, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.

రూ.10 లక్షల కోట్లు అప్పు

గత వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ శిథిలాలు తొలగించి, మళ్లీ ఇటుక ఇటుకా పేర్చుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారని, లక్ష కోట్లు వడ్డీ కట్టాలన్నారు. దీనికి తోడు అన్నింటా దోపిడీ చేశారని ఆరోపించారు. నాటి పాలకుల పాపాలు నేడు శాపాలుగా మారాయని సీఎం అన్నారు. రాష్ట్రం గాడిలో పడే వరకు కష్టపడతానన్నారు.

గత పాలకుల పాలన చూసి ప్రజలు విరక్తి చెంది, మొన్నటి ఎన్నికల్లో వన్ సైడ్ తీర్పు ఇచ్చారన్నారు. కూటమిని 93% సీట్లతో గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఎంత కసిగా ఓటు వేశారో ఈ ఫలితాలు చూస్తూనే తెలుస్తుందన్నారు. వైసీపీ పాలనలో కనీసం ప్రజలకు స్వేచ్ఛ కూడా లేకుండా, దుర్మరంగా వ్యవహరించారన్నారు. ఈ జగన్ ఎస్కోబార్ కంటే డేంజర్.... ప్రజలు ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం

రాయలసీమను గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తితో రాయలసీమ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శ్రీకారం చుట్టేందుకు గ్రామాల్లో వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వాలంటీర్లు లేకపోతే ఏం చేయలేరన్నారని, వాలంటీర్లు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత కథనం