CM Chandrababu : జగన్ పాలనలో పేదవాడికి కరెంట్ షాక్, విద్యుత్ రంగానికి రూ.47 వేల కోట్ల నష్టం-సీఎం చంద్రబాబు
CM Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి పేదవాడిని పీక్కుతిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు.
CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం వివిధ రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. తాజాగా సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే మొట్టమొదటి సారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. వైసీపీ ప్రభుత్వ కరెంటు బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అన్నారు. 2019తో పోల్చుకుంటే, 2024కి 98 శాతం కరెంటు బిల్లులు పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచి, పేదవాడిని పీక్కుతిందని విమర్శించారు. 2014-2019 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు.
9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు
"2019-2024 మధ్య ఒక అసమర్థుడు వచ్చి విద్యుత్ రంగం అప్పు 1 లక్షా 29 వేల ఐదు వందల కోట్లు చేశాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల బాదుడు ఇందుకే.. 2019-2024 మధ్య తన స్వార్ధ ప్రయోజనాల కోసం, పీపీఏలని రద్దు చేసి, పెట్టుబడిదారులపై కక్ష సాధించి, ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీశారు. 5 ఏళ్లు సీఎం ఆఫీస్ కి కూడా వచ్చినట్టు లేరు.. ఆ గదిలో కమోడ్ లు, ఏసీలు కూడా పని చేయని పరిస్థితి. పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.. చేతకాని పరిపాలన వల్ల, గత 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.47,741 కోట్లు" - సీఎం చంద్రబాబు
రూ.1.29 లక్షల కోట్ల బకాయిలు
ఏపీలో విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 2004లో తన పవర్ పోయినా పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలన్నారు. శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. 2019-2024 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందన్నారు. అసమర్థ నిర్ణయాలతో ప్రజలపై ఎన్నడూ లేనంత భారం పడిందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగించకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారన్నారు. గత 5 ఏళ్లు మొత్తం రూ.32,166 కోట్లు ప్రజలపై అదనపు భారం పడిందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీ డిస్కం రేటింగ్ లు పతనం
వైసీపీ ప్రభుత్వంలో గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం వేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. పెత్తందారులు, పేదవారికి పోటీ అన్న జగన్ పెత్తందారీ పాలనలో పేదవాడు చాలా నలిగిపోయాడన్నారు. జగన్ చేతకాని పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. జగన్ కారణంగా మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయామన్నారు. పోలవరం పవర్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చిందన్నారు. జగన్ అహంకారం వల్ల రాష్ట్రం నష్టపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో, ఏపీ డిస్కం రేటింగులు పతనం అయ్యాయన్నారు. ఉచిత ఇసుకపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
సంబంధిత కథనం