Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్, కూటమి ప్రభుత్వంలో నెలకు రూ.10 వేల వేతనం
Chandrababu : ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు వాలంటీర్లు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు.
Chandrababu : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు కలగాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో(Ugadi Celebrations) చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కొత్త ఏడాది మొదటి రోజు, చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్తపుంతలు తొక్కుతూ, మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకున్నారు. తెలుగు ప్రజలకు ఎంకో గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల(AP Volunteers) రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవచేసే వాళ్లకు టీడీపీ(TDP) ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
మళ్లీ మంచి రోజులు
వైసీపీ పాలనలో చెడు తప్ప మంచి లేదని చంద్రబాబు విమర్శించారు. మొత్తం చేదు, కారంగానే మార్చేశారన్నారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాసురుడి మాదిరిగా వైసీపీ ప్రభుత్వానికి (Ysrcp Govt)కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తుందని మండిపడ్డారు. సంక్షేమం ముసుగులో రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంపద సృష్టించాలని, ఆ సంపద మంచికి ఉపయోగించాలని చంద్రబాబు(Chandrababu) అన్నారు. ఉగాది నాడు మళ్లీ మంచి రోజులు రావాలనే సంకల్పం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు కూటమిగా వస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి
ఉగాది పండుగ సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చంద్రబాబు (Chandrababu)అన్నారు. కొత్త ఏడాదిలో సాధికారత రావాలని, ధరలు తగ్గాలి, శాంతి భద్రతలు ఉండాలని కోరుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలన బకాసురుడిని మించిపోయిందన్నారు. రాష్ట్రంలో అశాంతి, అభద్రతాభావమే కనిపిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసిన పార్టీ టీడీపీ(TDP) అన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు అందించామన్నారు. అయితే వైసీపీ(Ysrcp) సహజ వనరులన్నీ దోచుకుంటుందన్నారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే... ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి.. ఇదే మన సంకల్పమని అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో కూటమి విజయం
ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం(Panchanga Sravanam ) వినిపించారు. పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం చెప్పారు. త్రిమూర్తుల కలయికతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వేణుగోపాల్ చెప్పారు. ఈ ఏడాది చంద్రబాబుకు అధికార యోగం ఉందన్నారు. చంద్రబాబే ఆధునిక రాజధాని అమరావతిని(Amaravati) నిర్మిస్తారన్నారు.
సంబంధిత కథనం