TS Assembly Updates: తెలంగాణలో విద్యుత్ రంగంలో రూ.81,516 కోట్ల అప్పులు.. అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల
TS Assembly Updates: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు.
TS Assembly Updates: తెలంగాణలో విద్యుత్ రంగం వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క సభలో విడుదల చేశారు. ఏ రంగం అభివృద్ధి చెందాలన్న అవసరమైన విద్యుత్‌కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరిస్తున్నట్టు చెప్పారు.
పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతి, సేవరంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరా కీలకమని చెప్పారు. వైద్యం, రవాణాలకు నాణ్యమైన విద్యుత్ అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రజల నాణ్యమైన జీవనశైలిని విద్యుత్ రంగం సూచిస్తుందని, ఆర్ధికంగా, నిర్వహణలో విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండాలన్నారు.
తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణలో స్థాపిత 4365.26మెగావాట్లు ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో నాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నాటి నాయకత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆ కొత్త ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.
తెలంగాణ ఏర్పడే నాటికి, చట్ట రూపకల్పన నమయంలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్నికి అదనంగా 1800మెగావాట్లు వచ్చేలా అప్పటి యూపీఏ నాయకత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో ఏర్పాటు చేశారన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును మాత్రమే నిర్మించి, దానిని కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం వల్ల పెట్టుబడి పెరిగిందని ఆరోపించారు. 4వేల వాట్లతో నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు బొగ్గుసరఫరాకు అదనంగా ఏటా 800కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 30ఏళ్ల ప్రాజెక్టు జీవిత కాలంలో అదనంగా భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ లో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. విద్యుత్ డిస్కం సంస్థలు రూ.62,461కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయన్నారు. 2023 అక్టోబర్ నాటికి విద్యుత్ సంస్థలకు మొత్తం రూ. 81,516కోట్లు అప్పులు ఉంటే వాటిలో రూ.30,406కోట్లను ఉత్పత్తి సంస్థలకు రోజువారీ నిర్వహణ మూలధన రుణం ఉందన్నారు. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ కో సంస్థలకు రూ.28,673 కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు నష్టాలకు 28,842కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు.
సాగునీటి శాఖ రూ.14,193కోట్లను విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉందన్నారు. వాస్తవ సర్దుబాటు చార్జీలను నాటి ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రూ.14,928కోట్లను డిస్కంలకు చెల్లించాల్సి ఉందన్నారు. రోజువారీ మనుగడ కోసం డిస్కంలు అలవి కానీ అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. గతప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నామని, విద్యుత్ రంగం ఎదుర్కొంటున్ ఆర్ధిక సవాళ్లను, గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. 2014నాటికి ఉన్న అప్పులకు ప్రస్తుతం ఉన్న అప్పులకు పొంతన లేదన్నారు. రూ.41,516కోట్లను పదేళ్లలో అప్పులు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.28,673కోట్ల బకాయిలు రాావాల్సి ఉందన్నారు.