Vundavalli Arun Kumar On AP Politics : ఏపీ రాజకీయాలు, సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నీ చేసుకుంటూ పోతున్నారన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యమంటూ అధికార వైసీపీ(Ysrcp) ప్రచారం మొదలుపెట్టింది. అయితే 175 స్థానాల్లోనూ జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి అనుకూలత ఉందన్నారు. చదువుకున్నవాళ్లు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇతర కారణాలతో వైసీపీకి వ్యతిరేకం అవుతున్నారు. అయితే వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామంటూ టీడీపీ(TDP) హామీ ఇస్తుందని, కానీ ఇవన్నీ ఎలా సాధ్యమనే విషయాలను ప్రజలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవర్ని గెలిపించుకోవాలో ప్రజలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు. జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు గ్యారంటీగా రద్దవుతాయన్నారు.
టీడీపీ, జనసేన కలిశాయనే భయం అధికార వైసీపీలో కనిపించడంలేదని ఉండవల్లి అన్నారు. వైసీపీ 40 శాతం, టీడీపీ 40 శాతం ఓట్ల పర్సంటేజ్ వస్తుందనుకుంటున్నానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయన్నా ఆయన ఈసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందన్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్(Budget) పై స్పందిస్తూ... దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం మరోసారి చిన్నచూపు చూసిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాదిలో ఎక్కువ స్థానాలు పెంచుతారన్నారు. జనాభా, అబద్దాల ప్రచారంలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీ నుంచి ఎన్నికైన 25 మంది ఎంపీలూ బీజేపీ(BJP)కి మద్దతు దారులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలన్నారు.
దేశంలో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఉండవల్లి(Vundavalli) మండిపడ్డారు. రామాలయం(Ram Mandhir) కట్టడం తప్పులేదు కానీ, జైశ్రీరామ్ పేరుతో రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం తప్పన్నారు. సౌదిఅరేబియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఆలయాలు కట్టుకునే అవకాశం ఉందన్నారు. కానీ భారత్ లో హిందూయిజం పేరుతో సెక్యూలర్ పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీకి తన పాలనపై ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే శ్రీరాముడి నామ జపం చేస్తున్నారన్నారు. బీజేపీ చెప్పే మాటలు అసలు హిందుత్వమే కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ మోస్ట్ మిస్ లీడింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు ఇచ్చిన నివేదికలో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అబద్ధాలు ప్రచారంలో భారత్ నెంబర్ స్థానంలో ఉంటే, అమెరికా 6వ స్థానంలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కోటి కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఆర్థిక దివాలా పేరుతో జరుగుతున్న మోసాలు వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.