CM Chandrababu : జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆపేశారు, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు-amaravati cm chandrababu released white paper on polavaram project alleged ysrcp govt destructed project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆపేశారు, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆపేశారు, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Jun 28, 2024 04:44 PM IST

CM Chandrababu On Polavaram : సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2019 నుంచి 2024 మే వరకు జరిగిన పోలవరం పురోగతి, ఖర్చు వివరించిన సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు.

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu On Polavaram : ఏపీలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. రానున్న 20 రోజుల్లో మొత్తం 7 శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, ప్రజలు గెలిచారు, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలన్నారు. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివ‌రిస్తూ, రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. ఇవాళ మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిందని చంద్రబాబు ఆరోపించారు. 2019 మే వరకు జరిగిన పోలవరం పురోగతి, అలాగే 2019 నుంచి 2024 మే వరకు జరిగిన పోలవరం పురోగతి, ఖర్చు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ఐదేళ్ల విధ్వంసం

పోలవరం ప్రాజక్టును ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు వివరించారు. టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణం ఒక యజ్జంలా సాగిందన్నారు. సవాళ్లను అధిగమించి పోలవరం నిర్మాణం చేపట్టామన్నారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించామని చంద్రబాబు తెలిపారు. గత టీడీపీ పాలనలో హెడ్ వర్కులు చేస్తూనే కాఫర్ కాఫర్ డ్యామ్ ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కేవలం 414 రోజుల్లో పూర్తి చేశామని సీఎం చంద్రబాబు గుర్తిచేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయన్నారు. గత టీడీపీ పాలనలో 72 శాతం పనులు పూర్తిచేసి, రూ.11,537 కోట్లు ఖర్చుచేశామన్నారు.

రెండు సీజన్లలో పనులు నిలిపివేత

గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఇరిగేషన్‌ శాఖ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వెబ్‌సైటులో పెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం కొందరితో కుమ్మక్కై చెప్పిన తప్పులను వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరమని చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రెండు సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపివేశారన్నారు. సమర్ధులైన అధికారులను బదిలీ చేసి పోలవరం ప్రాజెక్టును అస్తవ్యస్థం చేశారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని రెండేళ్ల తర్వాత గుర్తించారన్నారు. పీపీఏ కాంట్రాక్టరును మార్చవద్దని చెప్పినా, కాంట్రాక్టర్ ను మార్చారని మండిపడ్డారు.

ప్రమాణ స్వీకారం రోజునే పనులు ఆపేశారు

వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి రాగానే ముందూ వెనకా ఆలోచించకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలవరం పనులు ఆపేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యామ్నాయం చూడకుండా, ఏజెన్సీని రద్దు చేశారన్నారు. ప్రాజెక్ట్ మీద అవగాహన ఉన్న అధికారులని బదిలీ చేశారన్నారు. 2020 నవంబర్ వరకు పనులు మొదలు కాలేదని, వీటి పర్యవసానమే నేడు పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం