CM Chandrababu On Polavaram : పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేశారు- చంద్రబాబు
CM Chandrababu On Polavaram : వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, వరదలు వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందన్నారు.
CM Chandrababu On Polavaram : గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే పోలవరంపై రివర్స్ టెండరింగ్ చేపట్టారని, ఏజెన్సీతోపాటు సిబ్బందిని కూడా మార్చారన్నారు. గత ప్రభుత్వ నిర్ల్యక్షంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. రూ.447 కోట్లతో మరమ్మతులు చేసినా డయాఫ్రమ్ వాల్ బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందన్నారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు... మీడియాతో మాట్లాడారు.
ముంపు ప్రాంతాలు ఏపీకే
దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని సీఎం చంద్రబాబు అన్నారు. 2005లో వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు పనులపై 2014 నాటికి చాలా సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. పోలవరం డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామన్నారు. చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జ్ అవుతోందని గుర్తుచేశారు.
వరదలు వస్తే మరింత నష్టం
పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కాపర్ డ్యాం పూర్తిగా నిర్మించకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. దానికి సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే రూ.447 కోట్లు అదనపు ఖర్చు అవుతుందన్నారు. దీంతో మొత్తం వ్యయం రూ.990 కోట్లకు చేరుతుందన్నారు. రెండు కాపర్ డ్యామ్‌లకు రూ.550 కోట్లు, రూ.2 వేల కోట్లు కాపర్ డ్యాం గ్యాప్ నిర్మాణానికి ఖర్చు అవుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుందని చంద్రబాబు తెలిపారు. కాపర్ డ్యాం సీపేజీలు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు.
జగన్ రాజకీయాలకు తగని వ్యక్తి
జగన్ రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి అని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ క్షమించరాని నేరం చేశారన్నారు. 2014లో రాష్ట్రం కోసం తాను పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టును వేరే ఏజెన్సీని మార్చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏడాదికి దాదాపుగా రూ.13,683 కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. కాపర్ డ్యామ్ గ్యాప్‌లు నింపే సమయంలోనే కాంట్రాక్టర్‌లను మార్చేశారన్నారు. ప్రాజెక్టు గురించి ఏం తెలియకపోవడం జగన్ మూర్ఖత్వం అని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని చిక్కుముడిలా చేశారని, ఒక్కొక్కటి పరిష్కరించుకోవాలన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగ్గా అమలు చేయకుండా ప్రాజెక్టును మరింత సంక్లిష్టంగా మార్చారన్నారు.
సంబంధిత కథనం