CM Chandrababu Review : నీటి ప్రాజెక్టులపై నివేదిక కోరిన సీఎం చంద్రబాబు - సోమవారం 'పోలవరం' పర్యటన..!
CM Chandrababu Review On Projects : ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం, పనితీరుపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లోగా ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
AP CM Chandrababu Review On Projects : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సమీక్ష కూడా ప్రాజెక్టులపైనే నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం, పనితీరుపై పూర్తి వివరాలతో నివేదికను వారం రోజుల్లోగా ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించనున్నారు. దీంతో మళ్లీ సోమవారం పోలవరం కార్యక్రమం ప్రారంభించినట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎక్కడా సోమవారం పోలవరం కార్యక్రమం గురించి చెప్పకపోయినప్పటికీ, చంద్రబాబు పోలవరం పర్యటన సోమవారమే ఉండటంతో మళ్లీ సోమవారం..పోలవరం కార్యక్రమం గుర్తుకు వస్తుంది.
జలవనరులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా తనకు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి హోదాలో మొదట జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించారు.
ఐదేళ్లలో జలవనరుల శాఖలో జరిగిన పనులు, చెల్లించిన నిధుల వివరాలతో వెంటనే ఒక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల ప్రాధాన్యత, ప్రాంతాలు, తక్షణ అవసరాలు వంటి వివరాల ఆధారంగా ఈ నివేదిక ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఐదేళ్లలో జరిగిన చెల్లింపుల్లో ఎవరికీ ఎన్ని నిధులు ఇచ్చారు. వారు చేసిన పనులు, చేయాల్సిన పనులు అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
పోలవరం పనులపై ఆరా….
పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించి, నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తానని చంద్రబాబే స్వయంగా అధికారులకు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక మాత్రం వారం రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. పట్టిసీమకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటీ? మోటర్లు పని చేస్తున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు మరో 14 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు అందించారు. ఈ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే వీటిని పూర్తి చేసేందుకు దాదాపుగా రూ.30 వేల ఓట్లు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టులోని కీలకమైన డయాఫ్రం వాల్‌పై జరిగిన రాద్ధాంతంపైనా వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. డయాఫ్రం వాల్‌ను కూడా పరిశీలిస్తానని చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలో తెగిపోయిన చెరువులతో పాటు, కుప్పం ప్రాజెక్టుపైన కూడా మరో నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పెన్నా, గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించాలని తెలిపారు. ఒకటి, రెండేళ్లలో పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు వీలైన ఏర్పాటు చేయాలని సూచించారు.
నీటిపారుదుల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఒకరిద్దరి స్వార్థ రాజకీయ అవరసరాల కోసం ఆ పని చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో మాదిరిగా అధికారులు వ్యవహరిస్తే కుదరదని వ్యాఖ్యానించారు. జలవనరుల శాఖలో కొద్ది మంది అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని, ఇక ముందు వారి ఆటలు చెల్లవని హెచ్చరించారు. అటువంటి అధికారులపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.