AP New Ministers: బాధ్యతలు చేపట్టిన కొత్త మంత్రులు, పోలవరంపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న నిమ్మల రామానాయుడు
AP New Ministers: ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులు బాధ్యతలు చేపడుతున్నారు. శుక్రవారం నుంచి శాసనసభ జరుగనుండటంతో మంత్రుల బాధ్యతల స్వీకరణతో సచివాలయం సందడి నెలకొంది.
AP New Ministers: పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏడాదిలో పూర్తవ్వల్సిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్ళు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. పోలవరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను ప్రధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. గాడి తప్పిన నీటిపారుదల వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామన్నారు. కాలువలు,డ్రైన్లలో తూడు తొలగింపు, డీసిల్టింగ్ పనులకు తొలి దస్త్రంపై సంతకం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి పదేళ్ళు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామా నాయుడు ఆరోపించారు.గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాకులో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు.ముఖ్యంగా ఏడాది వ్యవధిలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పదేళ్ళకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు.అదే విధంగా 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్సు మెంట్ కింద విడుదల చేసిన నిధులను వేరే అవసరాలకు మళ్ళించిందని అన్నారు.
సియంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం,అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. మరలా దానికి మరమ్మత్తులు చేయాలన్నా కనీసం 440 కోట్ల రూ.లు అవుతుందని ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూ.లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉప శమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ,షట్టర్లు,గేట్లు వంటివాటి మరమ్మత్తుల నిర్వహణ వాటి పటిష్టీకరణకు అధికారులకు ఆదేశాలిచ్చామని జలవనరుల శాఖమంత్రి రామానాయుడు చెప్పారు.కాలువలు,డ్రైన్లలో గుర్రపు డెక్కు,తూడు తొలగించేందుకు తగిన పనులు చేట్టేందుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశామని అన్నారు.గత ప్రభుత్వం లాకులు,షట్టర్లకు మరమ్మత్తులు చేయలేదని కనీసం వాటికి గ్రీజు కూడా పూయలేదని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
గుజరాత్ తరహాలో పారిశ్రామిక అభివృద్ధి…
అమరావతి, జూన్ 20 : పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు.
గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ది పర్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తామన్నారు.
దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి తరలి వచ్చేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెండింగ్లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామన్నారు. 2014-19 మరియు 2019-24 మధ్యకాలంలో జరిగిన ఎంఓయూలన్నీ రియలైజ్ అయ్యేవిధంగా మరియు ఆయా పరిశ్రమలన్నీ రాష్ట్రంలో స్థాపించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కర్నూల్లో హైకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు
గురువారం ఉదయం 9.00 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టి.జి. భరత్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్ లో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
చంద్రన్న పాలలోనే కార్మికుల సంక్షేమం సాధ్యం
చంద్ర బాబు పాలలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ లో రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమల్లోవున్న వైయస్సార్ భీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా మార్చే ఫైల్ పై తొలి సంతకం చేశారు.
గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వల్ల నిర్మాణ రంగం కుధేలు అయిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు అమలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 రకాల పథకాల అమలును గత ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు.
కార్మిక శాఖకు సెస్సు రూపేణా వచ్చిన రూ.3,000 కోట్లను పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందన్నారు. కార్మిక భీమా పథకం కింద గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు హయాంలో రూ.2.55 కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.25 కోట్లను మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మరియు విజయవాడలలో వున్న ఈ ఎస్ ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 238 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా ఈ ఎస్ ఐ ఆసుపత్రులను గాలికి వదిలేసిందని విమర్శించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన విషయంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహించిందని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న గట్టి నమ్మకంతో కార్మిక శాఖ మంత్రి బాధ్యతలు తనకు అప్పగించారని, వారి నమ్మకం ఏమాత్రం ఒమ్ముకాకుండా కార్మికుల సంక్షేమానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను శాయశక్తులా కృషిచేస్తానని ఆయన అన్నారు.