CM Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు-hyderabad ntr bhavan ap cm chandrababu sensational comments on telangana politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Jul 07, 2024 02:07 PM IST

CM Chandrababu : తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ జెండా రెపరెపలాడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో టీడీపీ విజయానికి టీటీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయన్నారు.

తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu : తెలుగు జాతి తనకు ఎంతో ఇచ్చిందని, మళ్లీ జన్మంటూ ఉంటే, తెలుగు గడ్డ పైనే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీలో టీడీపీ విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారన్నారు. తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్నారు. ఎన్టీఆర్‌ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్న చంద్రబాబు...సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. తెలంగాణలో పదేళ్లుగా అధికారంలో లేకున్నా టీడీపీ కార్యకర్తలు పార్టీని వదల్లేదన్నారు. టీడీపీ నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా ఎగురుతూ ఉంటుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. తనను జైల్లో పెట్టినపుడు టీడీపీ శ్రేణులు చూపించిన చొరవ మరువలేనన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో తనకు మద్దతు నిర్వహించిన ఆందోళనలు చూసి గర్వంగా అనిపించిందన్నారు.

తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తా

"నాలుగోసారి ప్రమాణం చేశాక తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు వచ్చాను. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో నా విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. టీటీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ గడ్డపైన టీడీపీకి పునర్‍ వైభవం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బీఆర్‍ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. నా చొరవను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తెలుగుదేశం ధ్యేయం. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం." - సీఎం చంద్రబాబు

తెలంగాణకు మంచి పునాది పడింది

2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఏపీలో వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‍కు గట్టెక్కించే బాధ్యత తీసుకుంటానన్నారు. తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నానన్నారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా మారాలని ఆకాంక్షించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో 25 మంది భారతీయులు గెలిచారన్నారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారుల కమిటీ వేశామన్నారు. జాతిప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. తెలంగాణకు మంచి పునాది పడింది దీన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చింది.. ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజులు లేరు.. విర్రవీగితే ప్రజలు శిక్షిస్తారన్నారు. ఏపీ ఎన్నికల్లో యువకులు, ఉత్సాహవంతులను ప్రోత్సహించామన్నారు. టీడీపీ చరిత్రలో ఏపీ ఎన్నికల్లో చూసిన గెలుపు ఎప్పుడూ చూడలేదన్నారు. మనం ప్రజలకు సేవకులం.. పెత్తందారులం కాదన్నారు. ప్రస్తుతం ఉండేది 2024 సీబీఎన్ కాదు.. 1995 సీబీఎన్ అని 1995లో సీబీఎన్ ఎలా పనిచేశాడో అలా పనిచేస్తానని చెప్పారు. 1995లో తలుపులు తట్టి ప్రజా సమస్యలు పరిష్కరించానన్నారు. తెలంగాణలో టీడీపీకు పూర్వవైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Whats_app_banner

సంబంధిత కథనం