Free Sand Policy : ఏపీలో రేపటి నుంచే ‘ఉచిత ఇసుక’
Free Sand Policy in Andhrapradesh : ఏపీలో రేపట్నుంచే (సోమవారం) ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో రేపటి(జూన్ 8) నుంచి ఇసుక ఉచితంగా లభించనుంది. ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను అధికారులు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుత వరదలు కారణంగా ఇసుక తవ్వకాలు లేవు. సెప్టెంబర్ నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతారు. అయితే సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఉన్న స్టాక్ పాయింట్ల (నిల్వ కేంద్రాలు)లో అందుబాటులో ఉన్న ఇసుకను అమ్ముతారు. ఇది ఒక టన్ను ఇసుకు రూ.375 గా నిర్ణయించింది. అయితే దూరాన్ని బట్టీ ఈ ధర కూడా పెరుగుతుంది. అయితే ఇసుక తవ్వకాలు ప్రారంభం అయితే ఇసుక టన్ను ధర పెరిగే అవకాశం ఉంది.
ఈ టన్నురూ. 375 వసూలు చేసే దానిలో రవాణ, సీనరేజ్‌కు చెల్లిస్తారు. సీనరేజ్ కింద గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు రూ.88 చెల్లిస్తారు. మిగిలినది లోడింగ్, అరలోడింగ్ కింద తీసుకుంటారు. గత ప్రభుత్వ హయంలో అయితే టన్నుకు రూ. 475 వసూలు చేసేవారు.
ఇందులో ఇసుక తవ్వే జెపీ వెంచర్‌కు రూ.100, ప్రభుత్వానికి రూ. 375 వెళ్లేది. అంటే ఈ రేటు కేవలం స్టాక్ పాయింట్ దగ్గర ఉన్న వారికే ఉంటుంది. అలాగే స్టాక్ పాయింట్ దూరంగా ఉంటే టన్ను ఇసుక ధర రూ.600 ఉంచి రూ.1,000 వరకు ఉంటుంది. ఉదాహరణకు రంపచోడవరం వారికి ఇసుక కావాలంటే, టన్ను రూ.650-రూ.700 మధ్య దొరికేది. ఎందుకంటే జగ్గంపేట-గంగనాపల్లి మధ్యలో ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడ నుంచి రంపచోడవరం ఇసుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ధర ఎక్కువ ఉంటుంది. అలాగే స్టాక్ పాయింట్లు, ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నబట్టీ ఇసుక ధర ఉండేంది.
180 ఇసుక స్టాక్ పాయింట్లు….
రాష్ట్రంలో దాదాపు 180 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఈ రూ.375 అనేది కేవలం ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర ఉన్నవారికే. దూరంగా ఉండే వారికి ధర పెరుగుతుంది. ఇప్పుడు కూడా రంపచోడవరం వంటి సుదూర ప్రాంతాల వారికి ఇసుక ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇసుక తవ్వకం లేదు. ఇసుక తవ్వడం ప్రారంభిస్తే, అప్పుడు ఇసుక ధరకు తవ్వడానికి అయిన ఖర్చును కలుపుతారు. అప్పుడు టన్ను ఇసుక ధర పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీడీపీ కూటమి తెచ్చిన ఇసుక విధానం గతంలో అమలు చేసిందే. 20214-19 మధ్య ఇదే విధానాన్ని అమలు చేశారు. దానివల్ల పెద్ద పెద్ద నిర్మాణ రంగ కంపెనీలకు ఇసుక ఉచితంగా వస్తుంది. అందువల్ల ఆయా కంపెనీలకు లాభం జరుగుతుంది. 2014-19 రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణానికి ఎల్అండ్‌టీ విపరేతంగా కృష్ణా నదీ ఇసుకను తవ్వింది. దానివల్ల ఎల్అండ్‌టీ సంస్థకు ప్రయోజనం కలిగింది. కృష్ణా నదీలో అక్రమంగా ఇసుక తవ్వడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కూడా రూ.100 కోట్ల జరిమానా విధించింది.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇసుక విధానంలో మార్పులు చేశారు. రీచ్‌లు పెట్టి ఇసుకను అమ్మేవారు. దీని ధర కూడా పెంచారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లు నిర్మించే పేదవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మాణంలో ఎక్కువ శాతం ఇసుకకే ఖర్చు చేయాల్సి వచ్చింది.
దీంతో ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొగా, మరోవైపు ఇసుక ధర పెంచడంతో తమకు పనులు పోయాయని భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయంలో కూడా ఇసుకను దోచుకున్నారని టీడీపీ నేతలు చాలా సందర్భాల్లో విమర్శించారు.
రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు చంద్రబాబు కొత్త పాలసీలో కూడా పేదలకంటే… నిర్మాణ రంగ కాంట్రాక్టర్లకి, నిర్మాణ రంగ సంస్థలకు ఎక్కువ లాభం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఉచిత ఇసుక పాలసీ అమలు అయితే అందులోని ఇబ్బందులు బయటపడతాయి.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం