టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బిగుస్తున్న ఉచ్చు- మరో ముగ్గురు అరెస్ట్, అజ్ఞాతంలోకి మరికొందరు..!
Attack On TDP Office Case : టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులు తాజాగా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇదే కేసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అయితే నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పాడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొంత మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
2021 అక్టోబర్ 19న తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకలుగా వచ్చిన కొందరు… రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో శనివారం తియ్యగూర గోపిరెడ్డి, లంకా అబ్బినాయుడు, జింకా సత్యంలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాత కేసులను తవ్వితీస్తోంది. అందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై కేసును తిరగతోడుతుంది.
పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పాడి నిందితులు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ పుటేజ్‌ల్లో నిందితులను గుర్తించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు రోజులు నిందితుల వివరాలను సేకరించారు. ఈ గాలింపు చర్యల్లో జూలై 3న ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. తాజాగా శనివారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు.
జూలై 3న దేవానందం, రాంబాబు, మస్తాన్‌వలి, మొహియుద్దీన్, వెంకట్‌రెడ్డిను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా శనివారం తియ్యగూర గోపిరెడ్డి, లంకా అబ్బినాయుడు, జింకా సత్యంలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్దారించారు. దీంతో పోలీసుల గాలింపు చర్యలు తీవ్రతరం కావడంతో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంత మంది టీడీపీలో చేరుతామని, తమను వదిలిపెట్టాలని రాయబారాలు నడుపుతున్నారు. త్వరలోనే మరికొంత మందిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలు చర్యలు చేపట్టాయి.