CM Chandrabau : కుల గణన స్థానంలో నైపుణ్య గణన - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Andhrapradesh CM Chandrababu : ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన… పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కుల గణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని ప్రకటించారు.
Andhrapradesh CM Chandrababu : ఐదేళ్ల జగన్ పాలనలో సరిదిద్దలేనంత నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన…. ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చన్నారు.
కేంద్రం నుంచి తాము ఎలాంటి పదవులూ ఆశించలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదని గుర్తు చేశారు. ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ కోరినా తీసుకోలేదన్నారు. ఎన్డీయేలో ఉన్నందున అప్పుడు స్పీకర్ పదవి తీసుకున్నామని చెప్పారు.
ఇప్పుడు కూడా ఎన్డీయే ఇచ్చిన రెండు మంత్రి పదవులే తీసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీఏ ఇచ్చిన మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్న ఆయన… జగన్ పాలనతో అమరావతిపైన ఆకర్షణ కొంతవరకు తగ్గిందని వ్యాఖ్యానించారు.
అమరావతికి పూర్వవైభవం తేవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘటించారు. అమరావతిలో 135 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అమరావతికి అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని… అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతిలో తొలుత నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామన్నారు. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు.
మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు…స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామన్నారు. పీపీపీ నమూనా స్థానంలో పీ-4 విధానం తెస్తామని చెప్పారు. మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలూ అడుగుతున్నాయని చెప్పిన చంద్రబాబు… డెవిల్‍ను నియంత్రించామని కామెంట్స్ చేశారు. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదని… దావోస్ పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని ప్రకటించారు.
శనివారం జరగబోయే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై చంద్రబాబు స్పందించారు. రేపటి సీఎంల భేటీలో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.
సంబంధిత కథనం