One Way Communication: మారని జగన్ తీరు, ఇంకా వన్‌ వే కమ్యూనికేషన్‌ మాత్రమే.. ప్రశ్నలకు సమాధానాలు ఉండవంతే..-jagans behavior has not changed and there is only one way communication ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  One Way Communication: మారని జగన్ తీరు, ఇంకా వన్‌ వే కమ్యూనికేషన్‌ మాత్రమే.. ప్రశ్నలకు సమాధానాలు ఉండవంతే..

One Way Communication: మారని జగన్ తీరు, ఇంకా వన్‌ వే కమ్యూనికేషన్‌ మాత్రమే.. ప్రశ్నలకు సమాధానాలు ఉండవంతే..

Sarath chandra.B HT Telugu
Jul 05, 2024 10:05 AM IST

One Way Communication: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐదేళ్ల పాటు ప్రజలకు, మీడియాకు, ప్రశ్నలకు దూరంగా గడిపేశారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారు.

నెల్లూరు సెంట్రల్ జైలు వెలుపల మాజీ సిఎం జగన్
నెల్లూరు సెంట్రల్ జైలు వెలుపల మాజీ సిఎం జగన్

One Way Communication: ఏపీ మాజీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాననుకున్నదే నిజమనే భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగన్ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. దాదాపు అరగంట పాటు ములాఖత్‌లో పిన్నెల్లితో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు తన ఆవేశం, అక్రోశాన్ని ప్రదర్శించారు.

చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అందుకు మూల్యం చెల్లించుకుంటారని తీవ్ర స్థాయిలో జగన్ హెచ్చరించారు. జగన్ రాజకీయంగా చేసిన విమర్శలు, వాదనల మాటెలా ఉన్నా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. తాను ఎవరి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణితోనే నెల్లూరు పర్యటన సాగింది.

కాగితం చూడకుండానే మాట్లాడారే...

నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కాగితాలు చూడకుండానే, తడబడకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. దాదాపు 15-20 నిమిషాల పాటు తన మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేశారు. కానీ గత ఐదేళల్లో ఏనాడు కాగితం లేకుండా మాట్లాడే సాహసం కూడా జగన్ చేయలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఢిల్లీ పర్యటనలో ఓసారి, కోవిడ్ సమయంలో రెండు సార్లు మాత్రమే జగన్ అధికారంలో ఉండగా మీడియాతో నేరుగా మాట్లాడారు. మిగిలిన ప్రతి సారి కాగితాలు చూసి చదవడమో, ఎడిటింగ్ చేసిన వీడియోలను రిలీజ్ చేయడానికో పరిమితం అయ్యారు.

ఐదేళ్లలో జనంతో పూర్తిగా సంబంధాలను కట్ చేసుకుని పాలన సాగించడమే జగన్ ఓటమి కారణమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్‌ను కలిసేందుకు అభిమానులు, నాయకులు, పార్టీ వర్గాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాడేపల్లి, పులివెందుల, బెంగుళూరులో పెద్ద ఎత్తున అ‎భిమానులు కలిసేందుకు వెళ్లినా ఎవరికి ముఖం కూడా చూపలేదు. బెంగుళూరు నుంచి తిరుగు ప్రయాణానికి ముందు స్వయంగా జగన్ చెప్పడంతోనే సందర్శకుల్ని అనుమతించినట్టు తెలుస్తోంది.

ఇంకా వన్ వే కమ్యూనికేషన్...

ప్రశ్నలకు జవాబు చెప్పడం, ప్రశ్నను ఆహ్వానించడం అనేవి జగన్ పెద్దగా ఇష్టపడరు.రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి అదే ధోరణి జగన్‌లో ఉంది. మొదట్లో మీడియా తనకు వ్యతిరేకం కాబట్టి వారితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని భావిస్తున్నట్టు సన్నిహితులు చెప్పవారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడు,గత ఐదేళ్లలో కూడా ఇదే తీరుతో జగన్ వ్యవహరించారు. ఆయన చెప్పేది అంతా వినాలని భావిస్తారే తప్ప జనం ఏమనుకుంటున్నారో, జనం చెప్పేది వినాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

తనకు తానుగా ప్రజల నుంచి పూర్తిగా దూరం జరిగిపోయారు. తాడేపల్లి నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకుని అంతా అద్భుతంగా జరిగిపోతుందనే భావనలో ఐదేళ్లు గడిపేశారు. జనానికి తాను పూర్తిగా మేలు చేశానని చెప్పుకున్నారే తప్ప, జనం పడుతున్న ఇబ్బందులు, లోపాలను గుర్తించే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, ప్రజలకు మరేమి అవసరం లేదనే ధోరణితో జగన్ సాగారు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు సైతం జగన్‌ మనసెరిగి ప్రవర్తించారు. తనకు నచ్చని విషయాన్ని స్వీకరించే అలవాటు జగన్‌కు లేదని తెలుసుకుని లౌక్యం ప్రదర్శించారు.

వైనాట్ 175 అంటూ అంతులేని ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లి బోల్తా పడిన తర్వాత కూడా జరిగిన తప్పుల్ని జగన్ గుర్తించలేక పోతున్నారు.ప్రభుత్వ డబ్బులతో సర్వేలు, నివేదికల పేరిట కోట్లాది రుపాయల సొమ్ము చేసుకున్న వాళ్లు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదు. ఇంకా జగన్‌ తన పక్కన ఏ దారి లేక మిగిలిన భజన బృందం మాటల్ని గుడ్డిగా నమ్మేస్తూ జనంలోకి వచ్చి అసందర్భంగా మాట్లాడేస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంలను పగులగొట్టడం తప్పే కాదని, పిన్నెల్లి మంచి వాడంటూ కితాబివ్వడం ప్రజలకు ఎలాంటి సందేశాన్నిస్తాయని ఆలోచించు కోలేదు. అదే సమయంలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా తనను తాను సరిదిద్దు కోగలిగితేనే రాజకీయంగా జరిగిన నష్టం తగ్గుతుంది.

WhatsApp channel