YSRCP vs TDP : ఎన్నికల వేళ ఏపీలో 'డ్రగ్స్' కాక - వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్-a dialogue war is going on between ycp tdp regarding drugs found in visakhapatnam port ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Vs Tdp : ఎన్నికల వేళ ఏపీలో 'డ్రగ్స్' కాక - వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్

YSRCP vs TDP : ఎన్నికల వేళ ఏపీలో 'డ్రగ్స్' కాక - వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 10:23 AM IST

AP Elections 2024: విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటనపై వైసీపీ, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు… రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లోనూ డైలాగ్ వార్ నడుస్తోంది.

వైసీపీ వర్సెస్ టీడీపీ
వైసీపీ వర్సెస్ టీడీపీ

YSRCP vs TDP : ఏపీలో ఎన్నికల వేళ డ్రగ్స్ వ్యవహారం కాకరేపుతోంది. తాజాగా విశాఖ తీరంలో ఓ కంటైనర్ లో 25 వేల కేజీల డ్రగ్స్ దొరకటం(Drugs Seized in Vizag Port) సంచలనంగా మారింది. ఇది దొరికిన క్షణాల వ్యవధిలోనే రాజకీయ రంగును పులుముకుంది. ఓవైపు ఈ డ్రగ్స్ అంతా వైసీపీదేనంటూ తెలుగుదేశం పార్టీ నేతలు…. స్పందించారు. మరోవైపు ఈ వ్యవహారమంతా తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యాచ్ వాళ్లదే అంటూ వైసీపీ అంటోంది. ఇరు పార్టీలు కూడా పలువురి పేర్లను ప్రస్తావిస్తూ…. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేస్తున్నాయి. ఫలితంగా ఎన్నికల వేళ డ్రగ్స్ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారిపోయింది.

టీడీపీ విమర్శలు….

ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్(Drus in AP) దొరికిన కేసులో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ కూడా స్పందించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఆరోపించారు. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు... డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్?” అంటూ సూటిగా ప్రశ్నలు సంధించటం మొదలుపెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికార ట్విట్టర్ ఖాతాలో కూడా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున పోస్టింగ్ లు చేశారు. డ్రగ్స్ మాఫియా వైసీపీ, డ్రగ్స్ మాఫియా డాన్ అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది.

వైసీపీ రియాక్షన్….

ఇక ఇదే వ్యవహారంపై వైసీపీ కూడా ఓ రేంజ్ లో టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఏకంగా పలువురి ఫొటోలను కూడా అధికారిక సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసింది. వీరంతా టీడీపీ బ్యాచే అంటూ చెబుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన వాళ్లే ఈ దందా నడుపుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక తాజా ఆ పార్టీకి చెందిన సజ్జల మాట్లాడుతూ…. విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు, పురంధేశ్వరి బంధువులకే సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. ఎన్నికల సమయంలో మాట్లాడటానికి ఏమీ లేక డ్రగ్స్ విషయంలో టీడీపీ… తమపై తప్పుడు నిందలు వేస్తోందని అన్నారు. ప్రతి దాంట్లోనూ దుష్ప్రచారం,అబద్ధాలు మాట్లాడటం టీడీపికి అలవాటైందని దుయ్యబట్టారు.

ఇక జనసేన పార్టీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. మొత్తంగా కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రాలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు చెందిన నేతల మధ్యనే కాదు… సోషల్ మీడియా వార్ గట్టిగా నడుస్తోంది. అటువైపు నుంచి పోస్టు పడితే చాలు… ఇటువైపు నుంచి వెంటనే కౌంటర్ రెడీ అయిపోతుంది.

Drugs seized in Visakhapatnam Port: ఏపీలోని విశాఖ సీపోర్ట్‌లో(Visakhapatnam Port) గురువారం 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌ లో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. డ్రైఈస్ట్‌తో మిక్స్‌ చేసి వెయ్యి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ (Drugs Seized)తరలించేందుకు సిద్ధం చేశారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ డ్రగ్స్‌ ను సీజ్‌(Drugs seized) చేసింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీపేరుతో డెలివరీ అడ్రస్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ… విచారణ చేపట్టింది. కస్టమ్స్, డీఆర్ఐ తో కలిసి సీబీఐ ఈ ఆపరేషన్ ను చేపట్టింది.

ఇక ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకటం సంచలనంగా మారింది. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్ద ఎత్తున వీటిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం చర్చనీయాంశంగా మారింది.