Drugs Seized in Vizag Port : సీబీఐ 'ఆపరేషన్ గరుడ' - విశాఖలో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టివేత
Drugs Seized in Vizag Port: విశాఖపట్నం తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drugs seized in Visakhapatnam Port: ఏపీలోని విశాఖ సీపోర్ట్‌లో(Visakhapatnam Port) 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్ లో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ (Drugs Seized)తరలించేందుకు సిద్ధం చేశారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ డ్రగ్స్ ను సీజ్(Drugs seized) చేసింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీపేరుతో డెలివరీ అడ్రస్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ… విచారణ చేపట్టింది. కస్టమ్స్, డీఆర్ఐ తో కలిసి సీబీఐ ఈ ఆపరేషన్ ను చేపట్టింది.
కంటైనర్‌లో ఒక్కొక్కటి 25 కిలోల బరువున్న 1,000 బస్తాల 'డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి దొరికిన సరుకు డ్రగ్స్ అని ప్రాథమిక పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నామని… ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇక ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకటం సంచలనంగా మారింది. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్ద ఎత్తున వీటిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ డ్రగ్స్ మాఫియా జాక్ పాట్ - నారా లోకేశ్
Nara Lokesh On Drugs: మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. “ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసిపి చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. కొద్దిసేపటి క్రితం విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త నన్ను కలవరానికి గురిచేసింది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ (ఆషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన 21వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకోగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూ వస్తోంది. ఈ చీకటి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసిపి మూకలు టిడిపి కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి తెగబడ్డాయి. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు... డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్?” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.