Radisson Drugs Case : రాడిసన్ పార్టీలో క్రిష్ ఉన్నారో? లేరో? నిర్థారణ కాలేదు-డ్రగ్స్ కేసుపై డీసీపీ కీలక వ్యాఖ్యలు
Radisson Drugs Case : తెలంగాణలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితుడు వివేకానందకు డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ 10 సార్లు కొకైన్ డెలివరీ చేశాడని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన హోటల్ కు డైరెక్టర్ క్రిష్ వచ్చినట్లు గుర్తించామన్నారు.
Radisson Drugs Case : తెలంగాణలో సంచలనమైన రాడిసన్ డ్రగ్స్ పార్టీ (Radisson Drugs Case)కేసులో కీలక పేర్లు బయటకు వస్తున్నాయి. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్ నటి లిషి గణేష్ తో పాటు దర్శకుడు క్రిష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ చేర్చారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన...డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బీజేపీ నేత కుమారుడు, మంజీరా గ్రూప్ ఛైర్మన్ వివేకానందకు అబ్బాస్ 10 సార్లు కొకైన్ డెలివరీ చేశాడని పోలీసులు తెలిపారు. అబ్బాస్ గతంలో మంజీరా సంస్థలో పనిచేశాడన్నారు. రాడిసన్ హోటల్‌లో గతంలో చాలాసార్లు ఇలాంటి తరహా పార్టీలు జరిగాయన్నారు. నిందితుల్లో వివేకానంద, కేదార్, నిర్భయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
పరారీలో ముగ్గురు
ఈ కేసులో నిందితులైన మరో ముగ్గురు నిందితులు లిషి(Lishi Ganesh), శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని డీసీపీ వినీత్ తెలిపారు. మరో నిందితుడు చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే సినీ దర్శకుడు క్రిష్ ఆ పార్టీలో పాల్గొన్నారా? లేదా? అనేది ఇంకా పూర్తిగా నిర్ధరణ కాలేదన్నారు. క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పారన్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు యువతులతో సహా 9 మందిని అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని విషయాలను వెల్లడిస్తామన్నారు.
క్రిష్ ఏమన్నారంటే?
డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో తన పేరు రావడంపై డైరెక్టర్ క్రిష్(Director Krish) స్పందించారు. తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లింది నిజమేనని, అయితే తన స్నేహితులను కలవడం కోసమే వెళ్లానని తెలిపారు. అరగంట పాటు హోటల్‌లో ఉండి సాయంత్రం 6.45 గంటలకు హోటల్ నుంచి వెళ్లిపోయానన్నారు. ఈ విషయాన్ని తాను పోలీసులకు తెలియజేశానన్నారు. పోలీసులు ఒక స్టేట్‌మెంట్ అడిగారన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలకమైన వివేకానందను కలిసేందుకే డైరెక్టర్ క్రిష్ అక్కడకు వెళ్లారా? మరో కామన్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లారా? అనే విషయంపై ఇంకా స్పష్టం రావాల్సి ఉంది. ఈ కేసులో అరెస్టైన వివేకానందకు కోర్టు బెయిల్ ఇచ్చింది. కేదార్ తో పాటు మరొకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మిగిలిన వారిని విచారణ కోసం పిలిపించారు. అయితే యూట్యూబర్ లిషి గణేష్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం