Hyderabad Drugs : గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ, బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
Hyderabad Drugs : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటలో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల తనిఖీల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ నేత కుమారుడితో పాటు ఓ వ్యాపారవేత్త కుమారుడు, మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad Drugs : భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి(Gachibowli)లోని ఓ స్టార్ హోటల్ లో కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడిసన్ హోటల్ లో ప్రముఖ బీజేపీ నేత(BJP Leader) కుమారుడితో పాటు ఓ వ్యాపారవేత్త కుమారుడు డ్రగ్స్ పార్టీ(Drugs Party) ఇస్తున్నట్లు సమాచారంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన హైదరాబాద్ డ్రగ్స్ మహమ్మారి ఏదో రూపంలో బయటపడుతుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.
బీజేపీ నేత కుమారుడు అరెస్ట్?
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో కొందరు యువకులు పార్టీ చేసుకుంటున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ (Drugs)వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... తనిఖీలు చేయగా పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తు్న్నారు. వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల తనిఖీల సమయంలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఏస్ఓటీ పోలీసులు రాడిసన్ హోటల్ సోదాలు చేశారని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ తనిఖీల్లో కొకైన్ పట్టుబడిందన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేత కుమారుడు, మంజీర గ్రూప్ డైరెక్టర్ వివేకానంద, నిర్భయ్, కేదార్ అనే మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామన్నారు. ఈ ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో హోటల్ పై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. హోటల్ కి వచ్చి అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అతడి కోసం గాలిస్తున్నామన్నారు.
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం (ఫిబ్రవరి 22) తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. తన సోదరుడిని ఓ యువతి ప్రేమ విషయంలో విచారించడానికి వెళ్లిన నార్సింగి పోలీసులకు గంజాయితో షణ్ముఖ్ దొరికాడు. దాంతో షణ్ముఖ్‌ను, అతని సోదరుడు సంపత్ వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం వచ్చింది. అయితే బెయిల్‌పై షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ కనిపించలేదు. దీంతో అతనికి బెయిల్ వచ్చిందా? లేదా? అనేది స్పష్టత రాలేదు. అయితే, షణ్ముఖ్ జశ్వంత్‌పై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే తదితర విషయాలపై నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.
"షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో గంజాయి దొరకడం నిజమే అని ఏసీపీ రమణ తెలిపారు. తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వాడుకుని వదిలేశాడని షణ్ముఖ్ అన్న మీద వైజాగ్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ప్రజ్టీస్ హోమ్స్‌లో వాళ్లు ఉంటారని తెలిపింది. ఆ ఫిర్యాదుతో అక్కడికి వెళ్లి చూడగా షణ్ముఖ్ కూడా ఉన్నాడు. ఇంట్లో గంజాయి దొరికింది. దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్నాం" అని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు.
సంబంధిత కథనం