Netflix: మరో ట్విస్ట్.. ముందుగా సీబీఐకి చూపించాలన్న కోర్టు.. సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా వేసిన నెట్‍ఫ్లిక్స్
Netflix: ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ వెబ్ సిరీస్ విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది. నెట్‍ఫ్లిక్స్‌కు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. ఆ వివరాలివే..
The Indrani Mukerjea Story Buried Truth: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కావాల్సిన ఓ డాక్యుమెంటరీ సిరీస్‍పై సందిగ్ధత కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలతో స్ట్రీమింగ్‍ను ఆ ప్లాట్‍ఫామ్ వాయిదా వేసింది. సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ విషయంలోనే ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ వాయిదా పడింది.
షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రాకుండా ఆపాలని ముందుగా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిషన్ (CBI) వెళ్లింది. అయితే, అలా ఆదేశించేందుకు తమకు అధికారులు లేవని ఆ న్యాయస్థానం చెప్పింది. దీంతో బాంబే హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఆ డాక్యు సిరీస్ ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కాకుండా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీకి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై హైకోర్టు నేడు కీలక సూచనలు చేసింది.
స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే ముందు ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ సిరీస్‍ను సీబీఐ అధికారులకు నెట్‍ఫ్లిక్స్ చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో వాదనలు వినే ముందు సీబీఐ ప్రతినిధులకు ఈ సిరీస్ స్క్రీనింగ్ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ మంజూషా దేశ్‍పాండేలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
అప్పటి వరకు స్ట్రీమింగ్‍కు తీసుకురాం
సీబీఐ అధికారులకు ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ బరీడ్ ట్రూత్’ సిరీస్ చూపించాలన్న విషయంపై నెట్‍ఫ్లిక్ ముందుగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఆ తర్వాత అంగీకరించింది. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్ చేయబోయమని హైకోర్టుకు తెలిపింది.
షీనా బోరా కేసు విచారణ దశలో ఉందని, తరుణంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయితే ఇన్వెస్టిగేషన్‍పై ప్రభావం పడుతుందని సీబీఐ వాదిస్తోంది. ఈ సిరీస్‍లో నిందితులతో పాటు కేసుతో సంబంధం ఉన్న వారి, కొందరి సాక్ష్యుల ఇంటర్వ్యూలు ఉన్నట్టు ట్రైలర్‌తో తెలుస్తోందని, అందుకే దీన్ని ఆపాలని కోరింది. దీంతో ఈ సిరీస్‍లో ఎంత మంది సాక్షుల ఇంటర్వ్యూలు ఉన్నాయో చెప్పాలని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీని కోర్టు ఆదేశించింది. మొత్తంగా ముందుగా ఈ సిరీస్‍ను సీబీఐ అధికారులకు చూపాలని చెప్పింది.
‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ బరీడ్ ట్రూత్’ సిరీస్ ఫిబ్రవరి 23న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు వాయిదా పడింది. ఫిబ్రవరి 29 వరకు స్ట్రీమింగ్ చేయబోమని నెట్‍ఫ్లిక్స్ చెప్పింది. ఆరోజున విచారణ తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
2012లో తన కూతురు షీనా బోరాను హత్య చేశారన్న అభియోగాలతో ఇంద్రాణి ముఖర్జియా 2015లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆమె మాజీ భర్త సంజీవన్ ఖన్నా, తదుపరి భర్త పీటర్ ముఖర్జియా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యారు. గతేడాది మేలో ఇంద్రాణికి బెయిల్ వచ్చింది. మిగిలిన వారు కూడా బెయిల్‍పై బయట ఉన్నారు.