Buried Truth OTT Trailer: బరీడ్ ట్రూత్ ఓటీటీ డాక్యు సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఆ సంచలన మర్డర్ కేసుపై..
The Indrani Mukerjea Story: Buried Truth OTT Trailer: షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డాక్యు సిరీస్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది.
Buried Truth OTT: ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. దీంతో చాలా ఆసక్తి నెలకొంది. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ షీనా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసు గురించి ఇప్పుడు ‘బరీడ్ స్టోరీ’ పేరుతో సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 12) రిలీజ్ అయింది.
ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ నాలుగు ఎపిసోడ్లుగా ఉండనుంది. ఇరా బాహ్ల్, షానా లెవీ దీనికి దర్శకత్వం వహించారు. మేక్‍మేక్, ఇండియా టుడే గ్రూప్ ఈ సిరీస్‍ను నిర్మించాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ డాక్యు సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో నేడు ట్రైలర్ రిలీజ్ చేసింది నెట్‍ఫ్లిక్స్.
షీనా బోరా హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా అరెస్ట్ అయిన న్యూస్ రిపోర్టులతో ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ సిరీస్ ట్రైలర్ మొదలైంది. ముందుగా షినా.. ఇంద్రాణి సోదరి అని అనుకోవడం.. ఆ తర్వాత కూతురు అని తెలియడం కూడా ట్రైలర్లో ఉంది. ముంబైలో ముఖర్జియా, బోరా కుటుంబాల జీవితాలను మార్చేసిన ఘటనలతో ఈ సిరీస్ రూపొందింది.
ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయంటూ ట్రైలర్లో ఉంది. ముఖర్జియా, బోరా కుటుంబాల్లో ఉన్న చిక్కుముడులను, సభ్యుల మధ్య దెబ్బతిన్న బంధాలను కూడా సిరీస్‍లో చూపించనున్నారు మేకర్స్. డాక్యుమెంటరీ సిరీస్ కావడంతో వీటిల్లో కొన్ని ఒరిజినల్ ఇంటర్వ్యూలను కూడా మేకర్స్ చూపించనున్నారు. ఇంద్రాణి ముఖర్జియా, వారి కుటుంబం, అటార్నీలు, కొందరు జర్నలిస్టుల ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.
దేశంలో సంచలనంగా మారిన ఈ సంక్లిష్టమైన కేసును డాక్యుమెంటరీ సిరీస్‍గా తీసుకొస్తుండటంతో ఆసక్తి పెరిగింది. షీనా బోరా హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు విషయాలను కూడా ఈ సిరీస్‍లో మేకర్స్ చూపించనున్నారని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటి బయటికి రాని కొన్ని ఒరిజినల్ ఫుటేజీలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఇంద్రాణి ముఖర్జీయా గతేడాది అన్‍బ్రోకెన్: ది అన్‍టోల్డ్ స్టోరీ పేరుతో ఓ బుక్ రాశారు. తన జీవితం గురించి, జైలులో గడిపిన ఆరేళ్ల విషయాలను ఆమె ఈ బుక్‍లో రాశారు. ఓ మీడియా సంస్థకు సీఈవోగా ఉన్న సమయంలోనే షీనా బోరా హత్య కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు.
షీనా బోరా హత్య కేసులో 2015 ఆగస్టులో ఆమె తల్లి ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా మరికొందరు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఎన్నో మలుపులు, అనూహ్యమైన విషయాలు బయటికి వచ్చాయి. 2022 మేలో ఇంద్రాణికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం బెయిల్‍పై ఆమె బయట ఉన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది.
టాపిక్