తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medigadda Barrage Works : వేగవంతంగా 'మేడిగడ్డ' బ్యారేజ్ పనులు - వరదలు వచ్చేలోగా పూర్తి

Medigadda Barrage Works : వేగవంతంగా 'మేడిగడ్డ' బ్యారేజ్ పనులు - వరదలు వచ్చేలోగా పూర్తి

HT Telugu Desk HT Telugu

07 June 2024, 18:04 IST

google News
    • Kaleshwaram Irrigation Project Works : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ మరమ్మత్తు పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. పనుల జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.
మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ పనుల పరిశీలన
మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ పనుల పరిశీలన

మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ పనుల పరిశీలన

Kaleshwaram Lift Irrigation Project Works : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ మరమ్మత్తు పనులు ఈ వర్షాకాలంలో వరదలు వచ్చేలోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై మరోవైపు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కొనసాగుతుందని తెలిపారు. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు నీటిపారుదల ఈఎన్సీ అనిల్ కుమార్, మూడు ఏజెన్సీల ఇంజినీరింగ్ అధికారులు సందర్శించి పరిశీలించారు. ముందుగా మంథని మండలం సిరిపురం వద్దగల సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ ని సందర్శించి పరిశీలించారు. సుందిళ్ల బ్యారేజీ మరమ్మతులను చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్‌కాన్స్‌, నవయుగ వర్క్ ఏజెన్సీలు మరమ్మతు పనులు ప్రస్తుత బ్యారేజీ పరిస్థితిని మంత్రికి వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పై ఫోకస్….

సుందిళ్ల పార్వతి బ్యారేజ్ సందర్శన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పై ఫోకస్ పెట్టామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నా గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు పంప్ హౌస్ లు నిర్మించారని, బ్యారేజ్ లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. 

దేశంలోనే అత్యున్నత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మూడు బ్యారేజీలను పరిశీలించుమని అప్పగించామని, ఎన్ డి ఎస్ ఏ మూడు బ్యారేజ్ లలో ఏమేం చేయాలో ఒక రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. మూడు బ్యారేజీల రక్షణ... పునఃరుద్ధరణ కోసం మూడు ఏజెన్సీలకు పనులు అప్పగించి పనులు వేగవంతం చేశామని చెప్పారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిన తర్వాత ఏమి జరగనట్టు గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. వర్షాకాలంలో వర్షాలు కురిసి వరదలు వచ్చేసరికి పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించామని, పంపులన్ని పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు.

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ….

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, అవకతవకలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణ జరుపుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ అన్నారం, శనివారం సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ ని సందర్శిస్తారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పనుల పరిశీలన వీలుకాలేదన్నారు. మూడు ఏజెన్సీలకు పనులు అప్పగించామని వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా వరదలు వచ్చేలోగా పనులు వేగవంతంగా పూర్తి చేయిస్తామన్నారు.

ప్రాణహిత పై తుమ్మిడిహెడ్డి బ్యారేజ్ నిర్మిస్తాం…

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన తుమ్మిడిహెడ్డి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో తుమ్మిడి హెడ్డి నిర్మిస్తామని చెప్పామని, ఐదేళ్ళలో బ్యారేజ్ పూర్తి చేస్తామన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు లోని కన్నెపల్లి పంప్ హౌజ్ తో సహా అన్ని పంపులు రిపేర్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుందిళ్ల వద్ద పార్వతీ మ్యారేజ్ సందర్శించి పరిశీలించిన అనంతరం మంత్రి…. అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి సందర్శించి పరిశీలించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మరమ్మత్తు పనులు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రిపోర్టింగ్ -  HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

తదుపరి వ్యాసం