Harish Rao : యాసంగికి నీరు విడుదల చేసి సిద్దిపేట రైతాంగాన్ని ఆదుకోండి, మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ
Harish Rao : సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీరు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు.
Harish Rao : సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు అవసరమైన నీటిని మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్ కు పంప్ చేయాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాసారు. ఈ మేరకు శనివారం శాసన సభలో మంత్రిని కలిసి లేఖను అందజేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన మీకు మనసారా శుభాకాంక్షలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకు వస్తున్నట్టు హరీశ్ రావు లేఖలో చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందించామని, దీని వల్ల పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందన్నారు. ఈ ఏడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
రిజర్వాయర్ లో 1.50 టీఎంసీ మాత్రమే
యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు టీఎంసీల నీరు ఉండాలని హరీశ్ రావు అన్నారు. కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో 1.50 టీఎంసీ మాత్రమే ఉందన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్ కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించవలసిందిగా కోరారు. గత మూడు సంవత్సరాలుగా అందించిన విధంగానే ఈసారి కూడా యాసంగి పంటకు కావాల్సిన సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా సిద్ధిపేట జిల్లా రైతాంగం పక్షాన హరీశ్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం రోజు హరీశ్ రావు తన నియోజకవర్గంలో పలు కార్యకర్తలను కలిశారు. సిద్దిపేట రూరల్ మండలం తొర్నాల గ్రామానికి చెందిన పిచర భాగ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు.
రిపోర్టింగ్ : హెచ్.టి తెలుగు, సిద్ధిపేట ప్రతినిధి