Medigadda Report: మేడిగడ్డ బ్యారేజ్‌ ఇక పనికి రానట్టే..! డ్యామ్‌సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు-dam safety authority report says medigadda barrage is no longer functional ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medigadda Report: మేడిగడ్డ బ్యారేజ్‌ ఇక పనికి రానట్టే..! డ్యామ్‌సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు

Medigadda Report: మేడిగడ్డ బ్యారేజ్‌ ఇక పనికి రానట్టే..! డ్యామ్‌సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు

Sarath chandra.B HT Telugu
Nov 03, 2023 02:04 PM IST

Medigadda Report: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇక పనికిరాకపోవచ్చని నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ భావిస్తోంది. ఇప్పుడున్న బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

మేడిగడ్డను పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ
మేడిగడ్డను పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ

Medigadda Report: మేడిగడ్డ ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక వెలువరించింది. బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగా లేవని, బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో దానిని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాల్సిందేనని డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నివేదిక పేర్కొంది.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. నిర్వాహణ లోపాలు, నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని, బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని నివేదికలో పేర్కొన్నారు.

మేడిగడ్డలో ప్రస్తుతం తలెత్తిన సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది.

ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమని అభిప్రాయపడ్డారు.

బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో పాటు ఫౌండేషన్ కోసం వినియోగించిన మెటీరియల్ పటిష్టతలో లోపాలు, వాటి సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ ఎగువున లోడ్ వల్ల ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీనమై పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు మేడిగడ్డ కుంగిపోవడంతో కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, 20 అంశాలపై వివరాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉందని నివేదికలో వివరించారు.

2023 అక్టోబర్ 29, లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపింది.

వర్షాకాలానికి ముందు , ఆ తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లీషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించలేదు.

ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం తమకు ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో పేర్కొంది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయని తేల్చింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని, నిర్మాణానికి వాడిని మెటీరియల్ పటిష్టంగా లేదని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కీలకం కాగా.. అక్టోబర్​ 21న పునాది కుంగిపోయి, పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో నేషనల్ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ నియమించిన కమిటీ అక్టోబర్​ 23న మేడిగడ్డ బ్యారేజ్​ ని పరిశీలించింది.

బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజీని యథాతథంగా ఉపయోగించడానికి అవకాశం లేదని కమిటీ నివేదిక పేర్కొంది. ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందని హెచ్చరించారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారని భవిష్యత్తులో రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సందిళ్లను తనిఖీ చేయాలని కమిటీ సూచించింది.

Whats_app_banner