BRS KTR: మార్చి1న బిఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ.. రాజకీయ వైరంతో ప్రాజెక్టులకు ముప్పు కలిగించొద్దన్న కేటీఆర్-brs chalo madigadda on march 1 ktr said not to threaten the projects with political feud ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Ktr: మార్చి1న బిఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ.. రాజకీయ వైరంతో ప్రాజెక్టులకు ముప్పు కలిగించొద్దన్న కేటీఆర్

BRS KTR: మార్చి1న బిఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ.. రాజకీయ వైరంతో ప్రాజెక్టులకు ముప్పు కలిగించొద్దన్న కేటీఆర్

Sarath chandra.B HT Telugu
Feb 27, 2024 12:31 PM IST

BRS KTR: మార్చి1న చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతామని ప్రకటించారు.

మార్చి 1న మేడిగడ్డ సందర్శిస్తామని ప్రకటించిన  కేటీఆర్
మార్చి 1న మేడిగడ్డ సందర్శిస్తామని ప్రకటించిన కేటీఆర్

BRS KTR: బిఆర్‌ఎస్‌ పార్టీ మీద వైరంతో సాగునీటి ప్రాజెక్టుల్ని బలి చేయొద్దని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మార్చి1న తలపెట్టిన ప్రాజెక్టుల సందర్శనకు తమతో పాటు కాంగ్రెస్ మంత్రుల్ని కూడా తీసుకుని వెళ్తామన్నారు. కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండబెడతామన్నారు.

మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని, పాడైన బారేజీల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయన్నారు.

సమస్య వచ్చిన చోట సులువుగా ఒక కాఫర్ డ్యాం నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చని, మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే... అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే చెప్పామన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వేసిన ప్రతి విచారణ స్వాగతించామని…రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేమమని, సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారని, అవసరమైతే తమపై దుష్ప్రచారం చేయాలని... ఇంకేమి చేసినా ఫర్లేదని, రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయొద్దని కోరారు.

పంట పొలాలను ఎండబెట్టొద్దని, మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలన్నారు. మేడిగడ్డ మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బారాజులు కొట్టుకుపోవాలని కుట్రలను కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆరోపించారు. రానున్న వర్షా కాలంలో మూడు బారేజీలు, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతాయని చెప్పారని, ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమే ఈ ఆరోపణలు అని కేటీఆర్ ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించాలని, రాష్ట్ర రైతాంగంపై కక్షపూరిత వైఖరి సరికాదని, నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులపైన... తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బారాజ్‌లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుందని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదని గతంలో కాంగ్రెస్ సిఎంలు, ప్రధానులు చెప్పారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయంలో జల యజ్ఞంలో భాగంగా కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించిందని, కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.

కాగ్ రిపోర్ట్ విషయంలో ద్వంద ప్రమాణాలు... వేరువేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుంది... కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner