Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు-peddapalli sundilla parvathi barrage water released into godavari for repair ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

HT Telugu Desk HT Telugu
May 19, 2024 08:01 PM IST

Sundilla Parvathi Barrage : కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీని అధికారులు ఖాళీ చేశారు. నీటిని గోదావరిలోకి వదిలారు. మరమ్మత్తుల కోసం నీళ్లన్ని ఖాళీ చేశామని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీలోని నీళ్లు లేకపోవడంతో చేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.

ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు
ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Sundilla Parvathi Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల పార్వతి బ్యారేజీ ఖాళీ అయ్యింది. నీళ్లు లేక ఏడారిని తలపిస్తుంది. బ్యారేజీ మరమ్మత్తుల కోసం ప్రాజెక్టులోని నీటిని దిగువన గోదావరిలోకి వదలిపెట్టారు. రెండు రోజుల్లోనే ప్రాజెక్టులో నీళ్లన్ని ఖాళీ అయ్యాయి. బ్యారేజీ లోని నీళ్లను వదిలిపెట్టడంతో దానిపై అధారపడి జీవనం సాగించే గంగపుత్రులు మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఎగబడి ఆందోళన చెందుతున్నారు.

ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించింది. లక్షా 20 వేల కోట్ల వ్యయంతో 13 జిల్లాల ద్వారా సుమారు 500 కిలోమీటర్ల దూరం వరకు 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి 1800 కిలోమీటర్లు కాలువ నెట్ వర్క్ తో ఏటా 240 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టును రూపకల్పన చేసి 2019 జూన్ 21న ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు అబాసు పాలవుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని తొలిమెట్టు మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ లోని ఏడో బ్లాక్ లో రెండు పిల్లర్లు కుంగి బ్యారేజీ డ్యామేజ్ అయింది. ఆ తర్వాత అన్నారం వద్ద గల సరస్వతి బ్యారేజీ వద్ద నీటి బుడగలు రావడంతో వెను వెంటనే మరమ్మత్తులు చేశారు. రెండు బ్యారేజీ లపై గత 8 మాసాలుగా విమర్శలు ఆరోపణలు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ డ్యామ్ షెప్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ)విచారణ జరిపి నివేదిక సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ లతో పాటు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ స్థితిగతులపై కూడా కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏకకాలంలో మూడు బ్యారేజీ లపై అధ్యయనం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ ను దిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎస్ఎంఆర్ఎస్)తో అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ( సీడబ్ల్యూపిఆర్ఎస్) తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్ లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఏ) తో అధ్యయనం చేయించనున్నారు. బ్యారేజీలు ఏవిధంగా ఉన్నాయనే దానిపై మూడు సంస్థలతో భౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులతో చర్చించి మూడు సంస్థలతో మూడు బ్యారేజీలపై అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగానే సుందిళ్లలోని పార్వతి బ్యారేజీలోని నీళ్లన్నీ దిగువకు వదిలి ప్రాజెక్టును ఖాళీ చేశారు. మరమ్మత్తుల కోసం నీళ్లన్ని ఖాళీ చేశామని అధికారులు చెబుతున్నారు.

చేపల కోసం ఎగబడ్డ జనం

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనంతోపాటు మరమ్మత్తు పనుల నేపథ్యంలో సుందిళ్ల బ్యారేజీలోని నీళ్లన్నీ దిగువకు వదిలి ఖాళీ చేయడంతో చేపల కోసం జనం ఎగబడ్డారు. పెద్దపెద్ద చేపలు పడుతుండడంతో మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు. నీళ్లన్ని గోదావరిపాలు చేయడంతో బ్యారేజీపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీ నీళ్లని వదలడంతో ఇసుక మట్టి తేలి చేపలు ఆగమవుతున్నాయని తాము ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీలో నీళ్లు ఉంటే చేపలు పట్టి రోజుకు 1000 నుంచి 1500 రూపాయల ఆదాయం పొందేవాళ్లమని ప్రస్తుతం నీళ్లు లేక చేపలు పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల్లో కాళేశ్వరం పంపుల వద్దకు సీఎం

వారం రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి వద్ద గల లక్ష్మీ పంప్ హౌజ్, సిరిపురంలోని సరస్వతి పంప్ హౌజ్, కాసిపేటలోని పార్వతి పంప్ హౌజ్ ను పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను పరిశీలించినప్పటికీ ఇప్పటి వరకు సీఎం పంప్ హౌజ్ లను పరిశీలించలేదు. బ్యారేజీల్లో నీటిని నిల్వచేస్తే పంప్ లు పంపింగ్ కు అనుకూలంగా ఉన్నాయా? లేవా? అనేది వారం రోజుల్లో జరిగే పర్యటనలో ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar