Delhi water shortage: ఢిల్లీలో వాటర్ షార్టేజ్; కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Delhi water shortage: దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొన్నది. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా, భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో, ఢిల్లీ వాసులు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సమస్య పరిష్కారం కోసం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Delhi water shortage: ఢిల్లీ వాసుల నీటి కష్టాలను తీర్చేందుకు సుప్రీంకోర్టు నడుం బిగించింది. అత్యవసరంగా 137 క్యూసెక్కుల మిగులు జలాలను ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగులు జలాల విడుదలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది. వజీరాబాద్ బ్యారేజీ ద్వారా నీటి విడుదలకు వెసులుబాటు కల్పించాలని హరియాణా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హరియాణాకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత నీటిని విడుదల చేయాలని కోర్టు హిమాచల్ ప్రభుత్వాన్ని కోరింది. నీటి ఎద్దడిని పరిష్కరించడానికి అప్పర్ యమునా రివర్ బోర్డు (UYRB) అత్యవసరంగా సమావేశం కావాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
నీటిని వృథా చేయొద్దు
నీటిని వృథా చేయొద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మండుతున్న ఎండల మధ్య దేశ రాజధాని ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నేపథ్యంలో నీరు వృథా కాకుండా ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నీటిని వృథా చేస్తే రూ.2 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సముదాయాల్లో అక్రమ నీటి కనెక్షన్లను తొలగించాలని అధికారులను ఆదేశించింది.
ఉష్ణోగ్రతలు, వడగాల్పులు
భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఢిల్లీలో భూగర్భ జలాలు తగ్గడానికి కారణమయ్యాయి. అలాగే, యమునా నదిలో నీటి మట్టం కూడా కనిష్ట స్థాయికి తగ్గింది. గత నెలలో వడగాల్పులు ఢిల్లీలో నీటి డిమాండ్ ను పెంచాయని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. వజీరాబాద్ బ్యారేజీ నుంచి పలుమార్లు కోరినా నీటిని విడుదల చేయలేదన్నారు. ఢిల్లీలో నీటి ఎద్దడి పరిష్కారం కోసం మే 30న ఆప్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు అభ్యర్థించడానికి '1916' అనే హెల్ప్ లైన్ నంబర్ ను ప్రకటించింది.