AP TG Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో తగ్గని ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు 12 మంది మృతి
AP TG Heat Wave : ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా... ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు ఒకే రోజులో 12 మంది మృతి చెందారు.
AP TG Heat Wave : ఏపీ, తెలంగాణలో ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు తగ్గడంలేదు. గత వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో వడదెబ్బకు పదుల సంఖ్యలు మృత్యువాత పడుతున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజులో 12 మంది వడదెబ్బకు బలయ్యారు. ఏపీలో ఆరుగురు, తెలంగాణలో ఆరుగురు వడదెబ్బకు బలయ్యారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతి జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. అలాగే తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హన్మకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ప్రకాశం జిల్లాలో ముగ్గురు వడదెబ్బకు బలి అయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందని కంది శ్రీనివాసరెడ్డి (45) వడదెబ్బతో మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మసాలా బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజులాగనే తోపుడు బండి తీసుకొని వివిధ కూడళ్ల వద్ద బొరుగులు, మసాలా అమ్ముతున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులవారి పాలేనికి చెందిన పోకూరి లక్ష్మమ్మ (80) భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తూ స్థానిక బస్సు షెల్టర్‌లోనే ఉంటున్నారు. తీవ్రమైన వడగాలులతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే శింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో 60 ఏళ్ల వృద్ధుడు వడగాల్పులకు తట్టుకోలేక మృతి చెందారు. ఆయన ఐస్ బండి వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
ఒకే రోజు ఆ గ్రామంలో ఇద్దరు మృతి
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరంలో ఇద్దరు వడదెబ్బకు మరణించారు. గ్రామానికి చెందిన ఏలూరు ముక్తేశ్వరరావు (63), షేక్ మహబూబ్‌బీ (60) వడదెబ్బకు కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మరణించారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం కోట మంగాపురం గ్రామానికి చెందిన మెరుల చంద్రయ్య వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. చంద్రయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీ పని కోసం గ్రామం నుంచి మండల కేంద్రం కేవీబీ పురం వెళ్లగా, పని చేసే ప్రాంతంలోని కళ్లు తిరిగి పడిపోయారు. ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.
తెలంగాణలో ఆరుగురు మృతి
తెలంగాణలో ఒకే రోజు ఆరుగురు వడదెబ్బకు బలయ్యారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటకు చెందిన తొగరు ఐలయ్య (85) వడదెబ్బకు గురయ్యాడు. ఆయన కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గంగాధర మండలం గర్శకుర్తిలో చిందం అన్నవ్వ (86), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో కోరుకొండ ఆనంద్ (65), మంచిర్యాల జిల్లా భీమారంలో అరెకిల్ల సంపత్ (45) ఎండ వేడికి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడ్దారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గుర్తి తెలియని 35 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. కరీంనగర్‌లోని గంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా, ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
అనంతపురంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా కొత్తపల్లి మండలంలో బసంపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ధర్మవరం పట్టణం ఎల్సికే పురానికి చెందిన గొల్లనారాయణ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందిమల్ల కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం