Single Screen Theatres: సినీ లవర్స్‌కు షాక్ - తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత - కారణం ఇదే
Single Screen Theatres: తెలంగాణ వ్యాప్తంగా పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. గత కొన్నాళ్లుగా పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడం, ఐపీఎల్ కారణంగా థియేటర్ల రెవెన్యూ తగ్గడంతో థియేటర్లను క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్ ఎఫెక్ట్...
మరోవైపు ఐపీఎల్, ఎలెక్షన్స్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల రెవెన్యూ చాలా తగ్గినట్లు సమాచారం. నిర్వహణ వ్యయాలు కూడా రావడం కష్టంగా మారిందని.... ఐపీఎల్ పూర్తయ్యి...పరిస్థితులు మొత్తం సాధారణ స్థితి చేరుకునే వరకు పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్లు సమాచారం.
శుక్రవారం నుంచి...
శుక్రవారం నుంచి థియేటర్లు మూత పడనున్నట్లు తెలిసింది. బుధవారం థియేటర్ల మూతపై సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు అఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
సమ్మర్‌లో నిల్...
సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఏటా ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్‌గా కనిపిస్తోంది. సమ్మర్‌లో నెలకు ఒకటి, రెండు పెద్ద హీరోలు సినిమాలు రిలీజయ్యేవి. ఈ సారి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా స్టార్ హీరో సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ వేసవిలో రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి కూడా వాయిదాపడ్డాయి. పలు చిన్న సినిమాలు విడుదలైన ఏది హిట్టు అందుకోలేదు.
రెండు నెలలు ఐపీఎల్...
వీటికి తోడు ఐపీఎల్ కూడా సమ్మర్‌లోనే మొదలుకావడంతో థియేటర్లకు గట్టి దెబ్బ తగిలింది. మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ మే 26 వరకు జరగబోతుంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ జరగడంతో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకే పరిమితమయ్యారు. థియేటర్లవైపు చూడటకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు రెవెన్యూ లేక డీలా పడినట్లు సమాచారం. ఇప్పటికే నష్టాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఐపీఎల్ మరింత భారాన్ని పెంచినట్లు చెబుతోన్నారు. ఎలెక్షన్స్ ప్రభావం కూడా కొంత పడినట్లు తెలిసింది.ఐపీఎల్, ఎలెక్షన్స్ వల్ల ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నట్లు సమాచారం.
ఈ వారం రిలీజ్‌లు వాయిదా...
థియేటర్ల బంద్‌తో ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలు పరిస్థితి డైలామాలో పడింది. రాజు యాదవ్‌తో పాటు పలు తెలుగు, తమిళ డబ్బింగ్ సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడితే ఈ సినిమాలు రిలీజ్ కావడం అనుమానమేనని సినీ వర్గాలు చెబుతోన్నాయి.