Makara sankranti 2024: భోగి, మకర సంక్రాంతి, కనుక పండుగలలో ఏమి చేయాలి? సంక్రాంతి విశిష్టత ఏమిటి?
14 January 2024, 9:00 IST
- Makara sankranti 2024: భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో ఏం చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదనే దాని గురించి పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలిపారు.
సంక్రాంతి విశిష్టత
Makara sankranti 2024: ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన రోజును సంక్రమణం అంటారు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం అనే పేరు ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
సంక్రమణం అంటే పాతది పోయి కొత్తది వచ్చుట. ఈ సంక్రమణం నుండి సూర్యుడు తన ప్రచండ తేజస్సుతో దివ్యకాంతులతో ప్రవేశిస్తుంటాడు. ప్రకృతిలో కూడా దివ్య తేజస్సు గోచరిస్తుంటుంది. 'సం” అంటే పెద్దదయిన క్రాంతి అంటే అభ్యుదయం. కాంతి కూడుకున్నది కావున సంక్రాంతి అన్నారు. హేమంత రుతువులో పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి రోజున జప, తప, పూజాది అధ్యాత్మిక సాధనలు ప్రాముఖ్యత సంతరించుకుంటాయని చిలకమర్తి తెలిపారు.
ఉత్తరాయణం ప్రాముఖ్యత ఏంటి?
సూర్య సంచారాలు రెండు భాగాలు. సూర్యగమనం భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయనమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనమనీ విభజన చేశారు. కర్కాటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఉన్న కాలాన్ని దక్షిణాయనమని, మకర సంక్రమణం మొదలు కర్కాటక సంక్రమణం వరకు ఉన్న కాలాన్ని ఉత్తరాయనమనీ అంటారు. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయనం దేవతలకు ముఖ్యం. అందుచేతనే దక్షిణాయనంలో ఎక్కువ వర్షాలు కురవడం వల్ల నదీనదాలు పొంగి వరదలు వస్తాయి. వీటి వాలల పంటలు నాశనం అవడమే కాదు కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది.
వివిధ రకాలైన వ్యాధులు, అంటువ్యాధులు, కలరా, శీతల రోగాలు, ప్రజలను పీడించి బాధపెడుతూ ఉంటాయని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాయణం మొదట్లో వానలు తగ్గి, కొంత ఎండ కాచినా చలి ఉంటుంది. హేమంత రుతువులోని చల్లదనానికి క్రిమికీటకాదులు వృద్ధి చెంది స్వేచ్చగా విహరిస్తుంటాయి. దక్షిణాయనపు మలి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు. కనుకనే పేడనీళ్లను ఇంటి ముందు చల్లి, అలికి శుభ్రం చేసి గుల్లసున్నపు పిండితో ముగ్గులు వేస్తారు.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?
పేడ, ముగ్గులోని కాల్షియం క్రిమికీటకాల నాశనకారి. అందువల్లనే ఈ రుతువులో ముగ్గులు వేస్తారు. రంగవల్లుల మీద పేడ ముద్దలుంచి వాటికి పసుపు, కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బి గొబ్బెమ్మలు అంటారు. ఈ గొబ్బెమ్మలు క్రిమికీటకాలను లోనికి రాకుండా కాపాడతాయి. సంక్రాంతి మూడు రోజుల పండుగ. కొన్నిచోట్ల నాలుగు రోజుల పండుగ చేస్తారు. మొదటి రోజును భోగి అని, రెండో రోజును మకర సంక్రాంతి, మూడవ రోజును కనుమ, నాలుగవ రోజును ముక్కనుమ అని పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భోగి : ఇది ఇంద్రునికి ప్రీతికరమైన రోజు. ఇంద్రుని, ఇష్ట దేవతలను పూజించాలి. ఈ రోజున తెల్లవారురూమున ఇంటి ముంగిట గానీ, నాలుగు మార్గాల కూడలి వద్దగానీ భోగిమంట వేస్తారు. ధనుర్మాసం నెల రోజులు తాము అర్చించిన గొబ్బెమ్మలను దండగా గుచ్చి అ దండలను భోగి మంటలలో వేయడం సంప్రదాయం. ఈ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేసి, కొత్తబట్టలు కట్టుకుంటారు. సాయంకాలం చిన్నపిల్లలకు భోగి (రేగుపళ్ళు, పూలరేకులు, చిల్లర డబ్బులు) పళ్ళు పోసి, హారతిచ్చి దిష్టి తీస్తారు. పేరంటాాళ్లకు నానబెట్టిన శనగలు, పండ్లు, తాంబూలాలు ఇస్తారు. కొందరు బొమ్మల కొలువు పెడతారు. సంతాన లక్ష్మి అయిన గోదాదేవిని పూజించి గోదాదేవి అండాళ్ కల్యాణం వైభవంగా జరుపుతారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మకర సంక్రాంతి : ఈ రోజు నదులలో, సముద్రంలో స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. పితరులకు తర్పణాలు విడవడం, దానధర్మాలు ఆచరించడం వల్ల విశేష పుణ్యఫలం సంప్రాప్తిస్తుంది. నదీ, సముద్ర స్నానాలకు అవకాశం లేనప్పుడు ఇంట్లోనే తలారా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలిచి నీటిని సమర్పించి “ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్మర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే" అని ధ్యానించి మూడుమార్లు ప్రదక్షిణలు చేయాలి. గారెలు, బూరెలు చిత్రాన్నాలు, పొంగలి నివేదన, సంక్రాంతి ప్రత్యేకం.
కొత్త కుండలో పాయసం తయారుచేసి పొంగలి నైవేద్యం పెడతారు. కనుక తమిళనాడులో పొంగల్ అంటారు. పాలు పొంగినట్లే ఇంట్లో సిరులు పొంగుతాయని భావిస్తారు. ధాన్యలక్ష్మి సూర్యదేవుని అనుగ్రహం వలన రేగుపండ్లు, చెరకుగడలు, నారింజ, దానిమ్మ పండ్లు నివేదన చేయాలి. పూజ చేయించిన బ్రాహ్మణునికి, గుడి దగ్గర పూజారికి దక్షిణ తాంబూలాదులతో, కూష్మాండ దానం సంక్రాంతి నాడు చేయడం విశేష పుణ్యం. ఈ దానం వల్ల భూదాన ఫలం అనుగ్రహిస్తాడు సూర్యభగవానుడు. శక్త్యానుసారం వస్త్రాలు, గొడుగు, పాదరక్షలు, నువ్వుండల దానం పుణ్యప్రదాలు. ఈరోజు ధాన్యలక్ష్మి పూజ, కోడిపందేలు, ఎడ్లపందేలు, గాలిపటాల పందేలు జరుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.
కనుమ : ఇది కర్షకుల పండుగ. పశువులను, పశువుల కొట్టాలను శుభ్రపరిచి వాటిని పూజిస్తారు. ఇది మంచి చలికాలంలో వచ్చే పండుగ కనుక నెయ్యి, నువ్వులు, నూనె మొదలగునవి శీతహరమైనవి ధారాళంగా వాడాలి. గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందేలు, పొట్టేళ్ళ సమరాలు, హరిదాసుల కీర్తనలు, జనుల మధ్య మానవతా ఆత్మీయతలు వెల్లివిరుస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.