Gobbemma: సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?-why are gobbemma placed in the middle of the sankranti rangoli ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gobbemma: సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?

Gobbemma: సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?

Gunti Soundarya HT Telugu
Jan 08, 2024 12:00 PM IST

Gobbemmalu: సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గులో ఖచ్చితంగా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పెళ్లి కాని ఆడపిల్లలు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.

గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? (youtube)

Gobbemmalu: సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. ఆడవాళ్ళు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ రంగవల్లుల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు. పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక ఆధారమే కాదు శాస్త్రీయ ఆధారం కూడా ఉంది.

గొబ్బెమ్మల ప్రాముఖ్యత

సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడతో కళ్లాపు చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ మీద నవ ధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి, రంగు రంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు.

గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టె పెద్ద గొబ్బెమ్మ గోదా దేవికి సంకేతం. ఆవుని గౌరీ మాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తు తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.

గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు.

శాస్త్రీయ కారణం ఏమిటంటే..

గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆవుపేడలో యాంటీ బయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారతాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు.

Whats_app_banner