Bhogi festival: భోగి రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఆంతర్యం ఏంటి?
Bhogi festival: సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ జరుపుతారు. ఆరోజు పిల్లల తల మీద భోగి పళ్ళు పోస్తారు. ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటంటే..
Bhogi festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల సంబరాలు మొదలయ్యాయి. ఇంటి ముందర అందమైన రంగవల్లులు, కోడి పందెలకి సిద్ధమవుతున్న కోళ్ళు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం చాలా సరదాగా ఉంటుంది.
నాలుగు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు భోగితో ప్రారంభం అవుతాయి. తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ తమ ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు, పిడకలు వేసి భోగి మంటలు వేస్తారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. భోగి మంటల మీద కాచిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. గడగడ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా చిన్నా పెద్దా చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా డాన్స్ చేస్తారు.
భోగి మంటలు ఎందుకు వేస్తారు?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగకి ముందు వచ్చేది భోగి. ఈ ఏడాది జనవరి 14 ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పనికి రాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. విరిగిపోయిన వస్తువులు నెగటివ్ ఎనర్జీని మూటగట్టుకుంటాయి. అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
భోగి పళ్ళు ఎందుకు పోస్తారు?
ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం వేల పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుతారు. ఈరోజు తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు. రేగు పండ్లనే భోగి పళ్ళు అంటారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఒక అంతార్థం ఉంది.
భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదిష్టి, గ్రహ పీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తలపై భాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి. రేగు పండ్లతో పాటు అందులో బంతి, చేమంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు వేస్తారు. పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తారు. ఇరుగు పొరుగుని పిలిచి వారితో కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకుని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవరూ తినరు.
రేగు పండ్లని ఆర్కఫలాలు, బదరీ ఫలం అంటారు. పిల్లల తల మీద భోగిపళ్ళు పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్టే. సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు. 12 ఏళ్ల లోపు చిన్నారులకి తలపై భోగి పండ్లు పోయవచ్చు.