Negative energy: డబ్బు ఖర్చు పెట్టకుండానే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని ఇలా తరిమేయండి
Negative energy: ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండవు. నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
Negative energy: ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడే కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగాఉంటే ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుంది. ఇంట్లో వారి ఆనందం, శాంతిని హరించి వేస్తుంది.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు చేస్తూ శాంతి పరిహారాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ రూపాయి డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయేలా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటి సానుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
ఇంట్లో ఉండే మురికి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకే ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులు నిల్వ చేసుకోకూడదు. ఇంటి నుంచి చెత్తను బయటకి పారేయాలి.
దీపం వెలిగించాలి
ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. దీని వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సాయంత్రం పూజ ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. అందుకే చీకటి పడగానే ఇంటి గుమ్మం దగ్గర లైట్లు తప్పనిసరిగా వేస్తారు. ప్రధాన ద్వారం చీకటిగా ఉంటే లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుందని నమ్ముతారు.
తోరణం కట్టాలి
ఇంట్లో నుంచి ప్రతికూల శక్తిని తరిమి కొట్టడానికి మామిడి ఆకులతో తయారు చేసిన తోరణం కట్టాలి. ఇది ఇంటికి శుభం చేకూరుస్తుంది. ఈ తోరణం ఆకుపచ్చగా ఉండాలి. ఎండిపోతే వెంటనే మార్చుకోవాలి.
ఉప్పు
ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకుండా ఉంటుందా? అంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం లేకపోతే ఈ చిట్కా ప్రయత్నించండి. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు కలిపి తుడుచుకోవాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
సూర్యుడికి నీరు సమర్పించడం
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడి పూజ చేసి నీటిని సమర్పించాలి. ఈ విధానాన్ని అర్ఘ్యం అంటారు. ఇలా చేయడం వల్ల సూర్య గ్రహం బలపడుతుంది. మీ జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉంటుంది. సూర్య గ్రహం గౌరవం, ప్రతిష్ఠకి సంబంధించినది.
తులసి పూజ
తులసి కోట దగ్గర రోజు శుభ్రం చేసి దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. తులసికి రోజూ అర్ఘ్యం సమర్పించి ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. శుక్రవారం ఉపవాసం ఉంది లక్ష్మీదేవి పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.