Sankranti festival: సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి? భోగి, కనుమ, ముక్కనుమ ఎందుకు నిర్వహించుకుంటారు?
Sankranti festival: సంక్రాంతి పండుగని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. అది ఎందుకో చక్కగా వివరించారు శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

Sankranti festival: సంక్రాంతి అభ్యుదయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్లించే పండగ. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గు చూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. ఈ సంక్రాంతి పల్లీయులకు ఎక్కువ అనందాన్ని కలిగిస్తుంది.
కష్టపడి పండించిన పంట ఇళ్లకి చేరే సమయం ఇది. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంక్రాంతి సందడి అప్పటి నుంచే..
మళ్ళీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వంటి తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే మొగలిపువ్వంటి మొగుణ్జియ్యవే
అని పాటలు పాడుతూ అమ్మాయిలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తారు. ఈ పాట ప్రాచీన జానపదులు పాడుకున్న పాట. నేటికీ ఆ పాట సంప్రదాయంగా సాగుతూనే వస్తోంది.
బంతి పూవులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగివచ్చింది
తెలుగు పల్లెలు నిద్రలేచాయి వెలుగులో కనువిచ్చి చూచాయి
అంటూ సంక్రాంతి గురించి ప్రముఖ కవి దాశరథి అద్భుతమైన గీతం ఆలపించారు.
సంక్రాంతికి రావడానికి నెల రోజుల ముందు నుంచే ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం చేస్తారు. కనుమ రోజు రథం ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గురు ఎవరు ఎంత పొడవుగా వేస్తారు అని పోటీలు పడి వీధుల చివరిదాకా ముగ్గులు వేస్తారు. ఈ పోటీలలో ఒక సరదా, ఒక నేర్పు ఇమిడి ఉన్నాయి. ఈ రోజున కమతాగాళ్ళకు ఏడాదికి సరిపడి ధనధాన్యాలను లభిస్తాయి.
ప్రస్తుత రోజుల్లో ఈ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించకపోయినా కానీ కనుమరుగు మాత్రం కాలేదు. ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో హరిహర దాసులు ఇంటింటికీ తిరుగుతూ హరికథలు పాడుతూ ఉంటారు. జానపదులకి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ వేడుకల్లో చెప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట. ఈ సంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాలలోనూ కనబడుతూనే ఉంది. ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంక్రాంతి పండుగ ఎలా వస్తుందంటే..
ఇక సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు.
సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్ధము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్మాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. పడమరకు అధిపతి వరుణుడు. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము. యోగశాస్త్ర ప్రకారం మన శరీరంలో షట్బక్రములలోని మూలాధారం వద్ద ఏనుగు (ఐరావతము) ఉంటుంది.
సూర్యుడు ధనూరాశినుంచి మకరరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్మాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ధనూరాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది. కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదుల చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని సూచిస్తారు.
మకర సంక్రాంతి విశిష్టత ఇదే
మకర సంక్రాంతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్చంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనూరాశిలో ప్రవేశించినప్పటికి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల పొడుగునా వాకిళ్ళ ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు పెట్టడం అత్యంత ప్రాచీనమైన సంప్రదాయమే.
పూజాస్థాన విశుద్ధ్యర్ధం దోమయేన పూజయేల్ తతః పంచవిదై శ్చూర్జైరంగవల్లీం ప్రకల్పయేత్ - స్కాందపురాణం
అంటే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరింపబడుతుంది. అందుకే అతి పవిత్రమైనది. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నలవరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో సంక్రాంతి ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినం. భూగోళమందు కర్మాటకరేఖ, భూమధ్యరేఖ, మకరరేఖలు ఉన్నాయి.
సూర్యభగవానుడు సప్తాశ్వాల మహారధం మీద పయనిస్తూ పన్నెండు రాశులలో సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడు మకరరాశితో కలసినప్పుడు ఆ రేఖతో సంక్రమణం చెంది సూర్యగమనం ఉత్తరదిశగా మారి ఉత్తరాయణ పుణ్యకాలం మనకు వస్తుంది. అలాగునే కర్కాటక రేఖతో కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యగమనం దక్షిణదిశగా ప్రారంభమయి దక్షిణాయణం వస్తుంది. ఈ రెండు (ఒక్కొక్కటి ఆరు మాసాలు) చొప్పున ఆయనాలు పూర్తి అయితే ఒక్క సంవత్సరకాలం పూర్తి అవుతుంది.
అందుకే భీష్మపితామహులు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడినా ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చు వరకు నిరీక్షించి ఆ తర్వాత తుదిశ్వాస విడిచారు. అందువల్ల ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనా పుణ్యకాలంగా కూడా వ్యవహరిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినాన్ని మకర సంక్రమణ సంక్రాంతిగా ప్రాధాన్యత పొందింది.
సంక్రాంతికి దానధర్మాలు ఎందుకు చేయాలి?
ఈ సంక్రాంతిలో “సం” అంటే మిక్కిలి క్రాంతి. అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతారు. ఇక మకరం అంటే మొసలి అని అర్థం. ఇది పట్టుకుంటే వదలదు. కాని మానవుడిని అధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, మోక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసిన చేయి. అందువల్ల ఈ మకర సంక్రమణం బారి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అందరూ తమ శక్తికి అనుగుణంగా దాన ధర్మాలు చేస్తే మంచిదని శాస్త్ర కోవిదులు చెబుతున్నారు. కేవలం ఈ సమయంలో మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా దీని ప్రభావం ఉండకుండా ఉండటం కోసం నిత్యం దానధర్మాలు చేయాలని అంటారు.
సంక్రాంతి విశిష్టత ఏంటంటే?
ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదు. మహారాణిలా ముందు భోగిని వెనుక కనుకను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట.
సంక్రాంతి : ఇది మకర సంక్రాంతి పుణ్యదినం. అందువల్ల ఈ రోజు యధాశక్తి దానధర్మాలు చేయుట వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు అంటవు.
స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయుటవల్ల సకల సంపదలతో పాటు చకృని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు.
కనుమ : రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వారి బిడ్డలకు ఏలోటు లేకుండా పాడిని అందించే గోమాతను.. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యపురాశులను ఇంటికి చేర్చేవరకు సహాయం చేసే బసవన్నకు పూజలు జరిపి పశువుల పండుగ చేస్తారు.
ఈరోజున అందరూ పోటీలు పడుతూ అందమైన ప్రభలు కట్టి వాటిపై పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఉంచి మేళతాళాలతో వీధులన్నీ తిరుగుతూ అత్యంత వైభవంగా ప్రభలతీర్థం నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నుల పండుగగా ఈ వేడుక నిర్వహిస్తారు.
ముక్కనుమ : భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత నాలుగో రోజు వచ్చే పండుగ ముక్కనుమ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు. బొమ్మల కొలువు పెడతారు. ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నిమజ్జనం చేస్తారు.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు అందమైన ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని అహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ అలయాలలోని అర్చకస్వాములు సూర్యోదయానికి ముందే పూజలు నిర్వహిస్తారు. ఇంటిముందు కళ్ళాపులు చల్లుతూ వివిధ రకాల ముగ్గులతో సప్తవర్దాల రంగవల్లికలను తీర్చిదిద్ది ఇంద్రధనుస్సులను ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంక్రాంతికి సందడే సందడి
ఆడపిల్లలు ముగ్గుల నడుమ ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతులతో అలంకరించి ఇరుగుపొరుగు వారిని పిలిచి గొబ్బియల్లో... గొబ్బియల్లో... అంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఈ పండుగ దినాలలో కోటివిద్యలు కూటి కొరకే అన్నట్టు హరిదాసులు హరినామ సంకీర్తనలు చేస్తూ వచ్చి కృష్ణార్వణం అంటూ ఇంటి ముంగిట భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఇక గంగిరెద్దులవారు బసవన్నను అడిస్తూ చిన్నారులను దీవిస్తూ ఉంటారు.
ఇలా జంగమదేవరలు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మదాసరలు, పిట్టలదొరలు, విచిత్ర వేషధారులు వేసుకుని కళాకారులంతా ఈ పండుగ దినాలలో వచ్చి వారి వారి కళలను ప్రదర్శిస్తారు. అందరూ ఇచ్చే కానుకలు ఆనందంగా స్వీకరించి చివరిగా ఒక పాత వస్త్రాన్ని ఇమ్మనికోరి భుజాన వేసుకునిపోతూ సుభోజ్యంగా ఉండాలమ్మ అంటూ దీవించిపోతూ ఉంటారు. ఇలా ఈ గ్రామ సీమల్లో ఏ కళాకారునీ రిక్తహస్తాలతో పంపకుండా కలిగిన దానిలో కలిగినంత ఇచ్చి పంపడం ఆనవాయితీ.
ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.