Makar sankranti 2024: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన, అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. ఇక ఇప్పటి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగ.
ఎంతో శ్రమించి పండించిన పంట ఇంటికి చేరుకునే సమయం. కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. వ్యవసాయంలో తమకి అన్నదమ్ములు మాదిరిగా తోడు ఉన్న పశువులని పూజిస్తారు. పంటలు సమృద్ధిగా పండించినందుకు గాను దేవతలకు కొత్త బియ్యంతో నైవేద్యం చేసి సమర్పిస్తారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ కాలం అని పిలుస్తారు. అసలు ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఏంటో తెలుసా?
మానవులుకి పగలు, రాత్రి ఉన్నట్టే దేవతలకు కూడా ఉంటుంది. ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు సమయం. అందుకే ఈ సమయంలో ఎక్కువగా శుభ ముహూర్తాలు, పెళ్ళిళ్ళు చేసుకునేందుకు అనువైన సమయం. ఈ కాలంలో ఏదైనా శుభకార్యం తలపెడితే దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. సౌర పంచాంగం ప్రకారం సూర్యుడు మకర రాశి ప్రవేశం చేసినప్పుడు ఉత్తరాయణం మొదలవుతుంది. దీనినే వేసవి కాలం అని కూడా అంటారు.
ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. సూర్యుడు దక్షిణ గోళం నుంచి ఉత్తర గోళం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. అందుకే పగలు ఎక్కువ, రాత్రి తక్కువగా ఉంటుంది. చలికాలం నుంచి వేసవిలోకి అడుగుపెడతాము. ఆ వాతావరణ పరిస్థితులకు శరీరం తట్టుకునే విధంగా ఉండేందుకు సంక్రాంతి సమయంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఎక్కువగా చేస్తారు. నువ్వులు శరీరానికి వేడిని ఇస్తాయి.
దేవతలు మేల్కొని ఉండే కాలం కనుక భక్తులు అడిగిన కోర్కెలు అన్నీ తీరతాయని నమ్ముతారు. అది మాత్రమే కాదు ఈరోజు నుంచి స్వర్గ దారాలు తెరుచుకుని ఉంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో పితృలకు తర్పణాలు వదలడం వల్ల వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ఏ దానమైన పుణ్యం తీసుకొస్తుందని చెప్తారు. ఉత్తరాయణ కాలం పుణ్యకాలం కాబట్టి భీష్ముడు అంపశయ్య మీదే ఉంది ఉత్తరాయణంలోనే ప్రాణం విడిచాడు.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలవుతుంది. ఈ సమయం దేవతలకు రాత్రిగా పరిగణిస్తారు. వారికి శక్తిని ఇవ్వడం కోసం భక్తులు ఎక్కువగా పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తారు. ఈ సమయంలోనే పండుగలు ఎక్కువగా వస్తాయి. మనం చేసే పూజల వల్ల దేవతలకు శక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు ఈ సమయంలో దక్షిణ అర్థగోళం వైపు కదులుతాడు. అందుకే ఈ కాలం పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.
రోగాలు, దుఖాలు అధిగమించేందుకు ఈ సమయంలో ఉపవాసాలు,యాగాలు, పూజలు వంటి మతపరమైన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తారు. సూర్య కాంతి భూమి మీద తక్కువగా పడటం వల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. అందుకే ఈ సమయంలో రోగాల బారిన పడకుండా ఉండేందుకు పూజలు, వ్రతాల పేరుతో నియమాలు పాటిస్తారు. దక్షిణాయనం దేవతల ఆరాధనకి ఎక్కువగా కేటాయిస్తారు.