Gayatri devi: నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారం- పూజావిధానం, విశిష్టత
04 October 2024, 8:06 IST
- Gayatri devi: నవరాత్రులలో రెండో రోజు గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారి విశిష్టత, పూజా విధానం గురించి ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
శరన్నవారాత్రుల్లో దుర్గాదేవి అలంకారం
దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ శుక్ల తదియ నాడు కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరిని శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో పూజించుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లేటెస్ట్ ఫోటోలు
ఈమేరకు దేవీ నవరాత్రుల్లో రెండో రోజున భక్తితో అమ్మను ధ్యానించుకుని, ఆ సర్వ మంగళ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్టించుకుందామని చిలకమర్తి తెలియజేశారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, శోభనమూర్తిగా కొలువై ఉంటుంది. ఆదిశంకరులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని వీక్షిస్తే మనసు పులకితమౌతుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీ మాత.
‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీ థియో యోనః ప్రచోదయాత్'
అని భక్తితో ఉచ్ఛరించినంతనే ఉపాసనాబుద్ధి తేజోవంతం అవుతుందని చిలకమర్తి తెలిపారు. ఈ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మ వారిని ఆరాధిస్తే చతుర్వేద పారాయణ ఫలితం కలిగి, సకల దురిత ఉపద్రవాలు పటాపంచలు అవుతాయని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు.
పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వ క్షేమానికై గాయత్రీ దేవి అర్చన అత్యంత ఆవశ్యకం. అందుచేతనే ఈ శరన్నవరాత్రులలో గాయత్రీ దేవిఉపాసన విశిష్ఠంగా పొందుపరిచారు దైవజ్ఞులు. శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తరంతో అమ్మ వారికి షోడశోపచార పూజ గావించి, వీలైనన్ని సార్లు గాయత్రీ మంత్రాన్ని పఠించి అమ్మకి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనలను చల్లగా కాపాడుతారు. ఈరోజు ధరించాల్సిన రంగు కనకాంబరం అని చిలకమర్తి తెలిపారు.