Shankham: దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి? శంఖాన్ని ఎప్పుడు పూజించాలి?
Shankham: శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఎటువంటి శంఖం ఇంట్లో ఉంటే మంచిది? దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి అనేది ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Shankham: భారతీయ సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మన పురాణాలలో మహా విష్ణువు శంఖ చక్రాలను ధరించడం శివుడు కూడా అనేక సందర్భాలలో శంఖాలని ధరించాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటటువంటి శంఖమును ఉపయోగించడం ఇవన్నీ కూడా శంఖము ప్రాధాన్యతను తెలుపుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త (బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివుడుకు చేసే అభిషేకాలలో శంఖం ద్వారా నీటిని పోసి అభిషేకం చేయడం కూడా శ్రేష్టముగా భావిస్తారు. శంఖము ద్వారా కూడా తీర్థాన్ని అందచేస్తారు. శంఖం లక్షీ స్వరూపమని పాలసముద్రంలో లక్ష్మీదేవితో పాటు శంఖము ఆవిర్భవించినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి. అందుకే శంఖాన్ని లక్ష్మీస్వరూపముగా కూడా భావిస్తారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతిరోజు శంఖాన్ని మోగించడం వలన శ్వాసకు సంబంధించిన రోగాలు తొలగుతాయని, ఆరోగ్య సిద్ది కలుగుతుందని శాస్త్రం తెలియచేస్తోంది. పూజ చేసేటప్పుడు ఇంటిలో శంఖాన్ని ఊదడం వలన క్రిమి కీటకాలు వంటివి దూరమవుతాయని చిలకమర్తి తెలిపారు.
శంఖం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
ఈనాటికి శంఖానికి మన ధార్మిక జీవితములో సంబంధము ఉంది. ప్రజలు శంఖాన్ని పూజింతురు. అర్చన సమయాలలో శంఖనాధము చేస్తారు. శంఖరాజము అన్నికంటె పెద్దదిగా ఉండును. దానిలోపలి భాగము ముత్యం లాగా ఉంటుంది. దాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్ర అలల హోరు వినిపిస్తుంది. వైజ్ఞానికముగా చూసినా కూడా శంఖము సున్నపు అంశముతో తయారు చేయబడింది. మానవుని దేహారోగ్యమునకు (ఎముకలు పెరుగుటకు) సున్నపు అంశము అత్యంత ఆవశ్యకం. వాత పిత్త దోషాలు పోవును. బలము కాంతిని ప్రసాదించును.
శంఖాన్ని ఎప్పుడు పూజించాలి?
శంఖం ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకొనువారు ఆరోగ్యముగా ఉంటారు. తులసితో కూడిన సాలగ్రామ తీర్థమును శంఖము ద్వారా స్వీకరించినా చాలు. రోగాలు పోతాయని పరమ పురుష సంహిత చెప్పుచున్నదని చిలకమర్తి తెలిపారు. దక్షిణావర్త శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది.
చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినమున ఇంటిలో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురు పుష్యమి, రవి పుష్యమి నక్షత్రములు, పుణ్య తిథులు ఉన్న పర్వదినములో తప్పకుండా పూజచేయాలి.
దక్షిణావృత శంఖం ఎప్పుడు ఊదుతారు?
సాత్విక పూజలలో, యజ్ఞాలలో ఉపయోగపడే శంఖము వివిధ సైజులలో ఆకారములలో ఉపయోగిస్తారు. బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వరకు క్షత్రియులు, వైశ్యులు కూడ పూజలలో ఉపయోగించేవారు. ఈ శంఖాలు సముద్రంలో తెలియాడుతూ సులభంగా దొరుకుతాయి. తెల్లటి శంఖాలు మంచి ఆకారములో ఉండటమే కాదు వాటిని ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖము కుడివైపును తెరచి ఉన్నది దక్షిణావృత శంఖము అంటారు. గాలి ఊదితే చక్కని ధ్వని వస్తుంది. రామాయణ, మహాభారతములలో దీని ప్రాశస్యము చెప్పబడింది.
నిత్యపూజలు, పండుగలప్పుడు ఈ శంఖం ఊదితే ఆ ధ్వనిని శుభప్రదమైనదని తెలుస్తుంది. ఈ దక్షిణావృత శంఖాలు కన్యాకుమారిలో దొరుకుతాయి. అంతా తెల్లరంగు శంఖము దొరకడం కొంచెం కష్టం అని తెలుస్తుంది. హీరా శంఖం అనునది చిన్నగా ఉండి సరస్సులలో దొరుకుతుంది. ఇది మేలి వజ్రములాగా చాలా విలువగలది. దొరకడం చాలా కష్టము. ఇంటిలో ఒక శంఖమే ఉండాలి కానీ రెండు ఉండగూడదు అని పెద్దలు తెలుపుతారు. కొందరు 4,5,6,7,9 శంఖాలు ఉండవచ్చును అని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.