Devi navaratrulu: నవరాత్రుల్లో ఈ రంగు దుస్తులు ధరించి దుర్గాదేవిని పూజించండి- వీటి ప్రత్యేకత ఏంటంటే?
Devi navaratrulu: అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. తొమ్మిది రోజుల్ పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో విశేషంగా పూజిస్తారు. ఈ నవరాత్రుల సందర్భంగా మీరు పూజ చేసేటప్పుడు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రంగులు ధరించడానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ధరించాలి అనేది తెలుసుకుందాం.
Devi navaratrulu: నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. అక్టోబర్ 3 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 12న వచ్చే విజయదశమితో వేడుకలు ముగుస్తాయి.
తొలి రోజు శైలపుత్రి దేవి ఆరాధనతో మొదలై చివరి రోజు సిద్ధిధాత్రి అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజు ఆదిపరాశక్తిని ఎంతో భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు ఒక నిర్ధిష్ట రంగుతో ముడిపది ఉంటుంది. ఇది విభిన్న శక్తులు, ఆశీర్వాదాలను సూచిస్తుంది. ఈ నవరాత్రుల సమయంలో కొన్ని రంగులు ధరించి పూజ చేయడం వల్ల దేవతను గౌరవించడమే కాకుండా అవి మనకు మేలు చేస్తాయని భక్తుల విశ్వసిస్తారు. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించి పూజలు చేయాలో తెలుసుకుందాం.
మొదటి రోజు- పసుపు
నవరాత్రి పసుపు రంగుతో ప్రారంభమవుతుంది. ఇది ఆనందాన్ని సూచిస్తుంది. ఈ ప్రకాశవంతమైన రంగు సానుకూలత, స్వచ్చతను చెప్తుంది. శైలపుత్రి దేవిని పూజించేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
రెండో రోజు- ఆకుపచ్చ
రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. ఈరోజు భక్తులు ఆకుపచ్చ రంగు ధరించి పూజలు చేయడం ఉత్తమం. ఇది జీవితంలో సామరస్యాన్ని, సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇతరులతో పాటు మనతో మనం కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుంది. వైద్యం, పునరుద్ధరణను ప్రోత్సహించే రంగు ఇది.
మూడో రోజు- బూడిద రంగు
గ్రే కలర్ అసాధారణ ఎంపిక. కానీ ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. చీకటిని కాంతిగా మార్చడాన్ని సూచిస్తుంది. జీవితంలో సానుకూల, ప్రతికూల శక్తులను సమతుల్యం చేసే తటస్థ శక్తిని సూచిస్తుంది. శాంతి, ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఈరోజు చంద్రఘంట అవతారాన్ని పూజిస్తారు.
నాలుగో రోజు- ఆరెంజ్
ఆరెంజ్ అనేది శక్తి, ఉత్సాహం, తేజస్సును సూచించే రంగు. ఇది మిమ్మల్ని శక్తివంతులను చేస్తుంది. నాలుగో రోజు కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. శక్తి రూపాన్ని ఎరుపు రంగుతో సూచిస్తారు. అందుకే భక్తులు ఈరోజు పూజ చేసేటప్పుడు నారింజ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇది మీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక ప్రయత్నాలలోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది.
ఐదో రోజు – తెలుపు
తెలుపు స్వచ్చత, శాంతిని సూచిస్తుంది. ప్రశాంతమైన స్వభావాన్ని ఇస్తుంది. గజిబిజి జీవితంలో ప్రశాంతత కోసం ఐదో రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి స్కంద మాతను పూజించండి. ఈ విధంగా తెల్లని దుస్తులు ధరించడం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఆరో రోజు- ఎరుపు
బలం, అభిరుచి, ప్రేమ, శక్తికి చిహ్నమైన ఎరుపును ఆరవ రోజు ధరించడం చాలా మంచిది. ఎర్రటి భయంకరమైన రూపాన్ని కలిగి రక్షిత లక్షణాలతో దేవత దర్శనమిస్తుంది. కాత్యాయని దేవిని ఈరోజు పూజిస్తారు.
ఏడో రోజు- రాయల్ బ్లూ
రాయల్ బ్లూ లోతైన జ్ఞానం, స్థిరత్వం భావాన్ని తీసుకొస్తుంది. ఈ రంగు మానసిక స్పష్టత, విశ్వాసం, సంకల్పంతో ముడి పడి ఉంటుంది. రాయల్ బ్లూ ధరించడం వల్ల మన దృష్టి బలోపేతం అవడంతో సహాయపడుతుంది. అంకిత భావంతో లక్ష్యాలను చేధించేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు దుర్గామాతను కాళరాత్రిగా దర్శనమిస్తారు.
ఎనిమిదో రోజు- గులాబీ రంగు
పింక్ ప్రేమ, కరుణ, దయను సూచిస్తుంది. ఇది సున్నితమైన రంగు, ప్రేమ, పరస్పర గౌరవం వంటి వాటిని గుర్తు చేస్తుంది. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈరోజు మహా గౌరీ రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు.
తొమ్మిదో రోజు- పర్పుల్ కలర్
నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఊదా రంగు దుస్తులు ధరించి భక్తులు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి. ఇది ఆశయం, ఆధ్యాత్మిక అవగాహనకు ప్రతీకగా భావిస్తారు. ఈ రంగు మనలోని జ్ఞానోదాయానికి ఒక రిమైండర్ వంటిది. నవమి నాడు సిద్ధిధాత్రి అమ్మవారిని పూజిస్తారు. కన్నెపిల్లలను గౌరవిస్తూ కన్యా పూజ నిర్వహిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.