Lord vishnu: నాలుగు నెలల పాటు యోగనిద్రలో మహావిష్ణువు, ఆ కాలంలో ఈ ప్రపంచాన్ని కాపాడేదెవరు?
25 July 2024, 12:00 IST
- Lord vishnu: దేవశయని ఏకాదశి నుంచి శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. మరి ఈ నాలుగు నెలలు విశ్వాన్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం.
యోగనిద్రలో విష్ణువు.. విశ్వాన్ని కాపాడేది ఎవరు?
Lord vishnu: జులై 17వ తేదీ తొలి ఏకాదశి జరుపుకున్నారు. దీన్నే దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచే విష్ణువు 4 నెలల పాటు సుదీర్ఘ నిద్రలోకి జారుకునే రోజుగా చెప్తారు. లోకాన్ని రక్షించే విష్ణువు విశ్రాంతి దశలోకి వెళతాడు. ఈ సమయాన్ని చాతుర్మాసం అంటారు.
లేటెస్ట్ ఫోటోలు
ఇతిహాసాలు, నమ్మకాల ప్రకారం విష్ణువు క్షీరసాగరం మథనం సమయంలో శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అయితే విశ్వం పనితీరును చేపట్టమని ఇతర దేవతలకు అప్పగిస్తారు. విష్ణువు నిద్రపోతున్న ఈ నాలుగు నెలలు విశ్వాన్ని ఎవరు రక్షిస్తారు. సృష్టికి సంరక్షణ, విధ్వంసం మధ్య సంతులనం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మానవజాతి సురక్షితంగా ఉంటుంది. మరి లోకాన్ని కాపాడే విష్ణువు యోగనిద్రలోకి వెళ్ళడం వల్ల ఈ నాలుగు నెలల పాటు విశ్వాన్ని కాపాడే బాధ్యత ఎవరెవరు తీసుకుంటారో చూద్దాం.
గురు పూర్ణిమ.. గురువులదే బాధ్యత
దేవశయని ఏకాదశి తర్వాత వచ్చే పండుగ గురు పూర్ణిమ. గురువులు లేదా ఉపాధ్యాయులు ప్రజల జీవితాల్లో మార్గదర్శకులుగా ఉంటారు. జ్ఞానాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తారు. అందువల్ల విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కొన్ని రోజుల పాటు విశ్వం సజావుగా పనిచేసే బాధ్యతను గురువులు, ఉపాధ్యాయులు తీసుకుంటారని చెబుతారు.
శ్రావణ మాసం.. శివుడి బాధ్యత
గురుపూర్ణిమ తర్వాత కొద్ది రోజులకు శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. నెల రోజులపాటు సాగే ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శివుడు విశ్వం బాధ్యతలను భుజాల మీద మోస్తాడని చెబుతారు. ప్రతిదీ ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూస్తాడు. అందుకే శ్రావణమాసంలో ధ్యానం, జపం, వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తారు. శివుడిని శాంత పరిచేందుకు ఈ కార్యక్రమాలు ఎక్కువగా తలపెడతారు.
కృష్ణాష్టమి.. కృష్ణుడి బాధ్యత
శ్రావణమాసంలోనే జన్మాష్టమి వస్తుంది. ఈ సమయంలో శివుడి తర్వాత విశ్వం బాధ్యతలను శ్రీకృష్ణుడు మోస్తాడని అంటారు. ఈ సమయంలో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. చిన్ని కృష్ణయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు.
వినాయక చవితి
చాతుర్మాస కాలంలోనే వినాయక చవితి వస్తుంది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. శివుని కుమారుడు, అడ్డంకులను తొలగించే గణేశుడికి అంకితం చేసిన వినాయక చవితి సాధారణంగా పది రోజులు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో గణేశుడు విశ్వం బాధ్యతలు తీసుకుంటాడని చెబుతారు. బొజ్జ గణపయ్యను ఇంటికి తీసుకువచ్చి నిత్యం పూజలు జరిపిస్తారు. ఆనందం సానుకూలతలు, కొత్తగా ప్రారంభించిన పనుల్లో నష్టపోకుండా చూడాలని కోరుకుంటూ వినాయకుడిని తొమ్మిది రోజులపాటు ఆరాధిస్తారు.
దుర్గాదేవి కోసం నవరాత్రులు
వినాయక చవితి తర్వాత మనకు నవరాత్రులు మొదలవుతాయి. ఈ తొమ్మిది రాత్రుల పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ సమయంలో ప్రతిదీ నియంత్రణలో ఉంచే బాధ్యతను దుర్గాదేవి తీసుకుంటుంది. చెడును నాశనం చేస్తూ ప్రతికూలతలు, ప్రమాదాలు జరగకుండా దుర్గాదేవి చూసుకుంటుంది. భక్తులు పూజలు, హారతులు, నవరాత్రి ఉత్సవాలు మరెన్నో కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు నిష్టగా పాటిస్తారు.
దీపావళి సంబరాలు.. లక్ష్మీదేవి బాధ్యత
నవరాత్రులు ముగిసిన కొన్ని రోజులకు దీపావళి సంబరాలు మొదలవుతాయి. దుర్గాదేవి తర్వాత లక్ష్మీదేవి, కుబేరుడు విశ్వాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటారని నమ్ముతారు. దీపావళి ఉత్సవాలు ఐదు నుంచి పది రోజులు పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో వీరిద్దరూ విశ్వాన్ని రక్షిస్తారు. దీపావళి సమయంలో ప్రజల సంపద, శ్రేయస్సును ఇవ్వమని లక్ష్మీదేవిని, సంపదలకు అధిదేవుడిగా కుబేరుడిని పూజిస్తారు. అనంతరం వచ్చే దేవుత్థాని ఏకాదశి రోజు విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు.