Guru purnima 2024: గురు పూర్ణిమ విశిష్టత ఏంటి? ఈరోజు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకోండి
Guru purnima 2024: గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు చేయాల్సిన పనులు ఏంటి? గురు పౌర్ణిమ విశిష్టత గురించి ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Guru purnima 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ, లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండుట చేత ఆ మాసమునకు ఆషాఢమాసమని, ఆ రోజు వచ్చిన పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమని శాస్త్రాల్లో చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అలాంటి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా పిలుస్తారని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ రోజు వేదవ్యాసుల వారు జన్మించుట చేత ఆషాఢ పౌర్ణమికి గురు పూర్ణిమ అనే పేరు వచ్చిందని చిలకమర్తి తెలిపారు.
భగవంతుడు మానవ శరీరంలో అవతరించినప్పుడు.. ఆ అవతరించిన శరీరాలలో గురువు ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు వశిష్ఠుల వారిని గురువుగా స్వీకరించి యోగవశిష్ఠ్యం వంటివి ఈ లోకానికి తెలియజేశారు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అందజేశారు. ఇవన్నీ కూడా గురువు ప్రాధాన్యతను తెలియజేస్తాయని చిలకమర్తి తెలిపారు.
భూలోకంలో జన్మించిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యానమును, ధ్యానము ద్వారా కర్మఫల త్యాగమును ఈ మూడింటి ద్వారా మోక్షమును పొందాలని మన మహర్షులు, ఆధ్యాత్మిక సాధకులు, గురువులు తెలియజేశారని చిలకమర్తి తెలిపారు. ఇలా కలియుగంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావడం కోసం వేదవ్యాసుల వారు వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను రచించి, మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించడం చేత ఆయన జన్మించిన ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అని చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు.
ఇంతటి విశిష్టత ఉన్న గురు పూర్ణిమ రోజు మనకి జ్ఞానాన్ని అందించిన మహర్షులు, రుషులు, వ్యాసుల వారిని స్మరించుకోవాలి. వారికి పౌర్ణమి రోజు తర్పణాలు వదలడం ప్రాధాన్యం. మన సనాతన ధర్మంలో మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏమిటనగా.. అద్వైతం, ద్వైతం, మరియు విశిష్టాద్వైతం. ఈ మూడు సిద్ధాంతాలను శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అందించినట్లుగా చిలకమర్తి తెలిపారు. వారి వారి సిద్ధాంతాలను అనుసరించి గురు పౌర్ణమి రోజు ఆ ఆచార్యులను పూజించాలని చిలకమర్తి తెలిపారు.
కారుకారు గురువు క గుణింతము చెప్ప
శాస్త్రసారములు చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలంబు గురువురా..
విశ్వదాభిరామ వినురవేమ
ఉపనయనం అయినటువంటివారు వారికి ఉపదేశం ఇచ్చిన గురువును, అలాగే ఉపనయనం కానటువంటి వారు.. గురువుల ద్వారా మంత్రోపదేశం పొందినట్లు అయితే అటువంటి గురువులను, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసినటువంటివారు వారి గురువులను, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వారు వారి గురువులను, సన్యాసాశ్రమంలో ఉన్నవారు వారి గురువులను ఈ రోజు వారి పరంపరకు అనుగుణంగా గురుపూజ చేయాలని చిలకమర్తి తెలిపారు.
ఈరకంగా ఈరోజు గురుపూజ వంటివి చేసి గురువు గారి పాదాములను కడిగి, పూలమాలతో సత్కరించి, వస్త్రములను, తాంబూల ఫలాలను అందచేసి వారి ఆశీస్సులు పొంది, గురువు గారి చేత ఉపదేశం, ఆశీర్వచనం పొందాలని చిలకమర్తి తెలిపారు. గురోపదేశం, గురు ఆశీర్వచనం పొందడానికి ఈ రోజు చాలా విశేషమైనదని చిలకమర్తి తెలిపారు. ఏ కారణం చేతనైనా ఇటువంటి గురువులు లేనప్పుడు, వ్యాసుల వారిని స్మరించుకుని ఆయన అందించినటువంటి అష్టాదశ పురాణాలు, మహాభారతం వంటివి చదువుకుని ఆయనకు తర్పణాలు వదిలినట్టు అయితే గురుపూజ చేసిన ఫలితం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.