Man barks like dog : రేషన్ కార్డులో 'కుక్క' పేరు.. బౌ బౌ అంటూ నిరసన!
20 November 2022, 7:25 IST
Man Barks Like Dog in front of government official : రేషన్ కార్డులో తప్పు పేరు పడటంతో ఓ వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. దత్తా బదులుగా కుత్తా(కుక్క) పేరు చూసి కోపం తెచ్చుకున్నాడు. ప్రభుత్వ అధికారి ముందు బౌ బౌ అంటూ.. నిరసన తెలిపాడు. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్లో జరిగింది.
ప్రభుత్వ అధికారి వద్ద నిరసన తెలుపుతున్న శ్రీకాంత్
Man Barks Like Dog in front of government official : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరు చేసినా.. రోజులు, నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిందే. ఇంత చేసినా ఒక్కోసారి ఫలితం దక్కదు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ దత్తా విషయంలోనూ ఇదే జరిగింది. ఇక సహనాన్ని కోల్పోయిన అతడు.. ఓ ప్రభుత్వ అధికారి ముందు వినూత్నంగా నిరసన చేపట్టారు. కుక్కలాగా అరుస్తూ ఆందోళన చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
రేషన్ కార్డులో తప్పు పేరు..
శ్రీకాంత్ కుమార్ దత్తా.. బంకుర ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. రేషన్ కార్డులో అతని పేరు తప్పుగా పడింది. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులుగా.. శ్రీకాంతి కుమార్ కుత్తా అని రేషన్ కార్డులో ప్రింట్ అయ్యింది. కుత్తా అంటే హిందీలో కుక్క అని అర్థం వస్తుంది.
Man Barks Like Dog viral video : రేషన్ కార్డులో శ్రీకాంత్ పేరు తప్పుగా రావడం ఇది మూడోసారి. ప్రతీసారి ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది.
"మొదటిసారి నా పేరు శ్రీకాంత్ మొండల్ అని రాశారు. నేను మొండల్ కాదు. దురేయ్ సర్కార్(ఇంటి ముందుకే ప్రభుత్వం) క్యాంప్ వద్దకు వెళ్లి అభ్యర్థన పెట్టుకున్నా. ఆ తర్వాత నా పేరును శ్రీకాంతో దత్తా అయ్యింది. మళ్లీ ప్రభుత్వ అధికారులను సంప్రదించాను. ఈ నెల 11న మరోమారు అప్లై చేసుకున్నాను. ఈసారి నా పేరు శ్రీకాంతి కుమార్ కుత్తా అని పడింది. ఇది చూశాక నేను మెంటల్‌గా చాలా మనోవేదనకు గురయ్యాను. మళ్లీ దురేయ్ సర్కార్ క్యాంప్‌నకు వెళ్లాను. అక్కడ ఓ సీనియర్ అధికారితో మాట్లాడాను. ఫలితం దక్కలేదు," అని శ్రీకాంత్ దత్తా వెల్లడించారు.
ఈ క్రమంలోనే.. ఓ ప్రభుత్వ అధికారిని రోడ్డు మీద అడ్డగించాడు శ్రీకాంత్. అధికారి కారును ఆపి.. కుక్కలాగా బౌ బౌ అంటూ, తన రేషన్ కార్డు పత్రాలను చూపిస్తూ నిరసన తెలిపాడు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Srikanth Kumar Dutta viral video : ఈ వినూత్న నిరసన తర్వాత.. రేషన్ కార్డులో పేరు మార్చే విషయాన్ని ప్రభుత్వ అధికారులు కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. రెండు రోజుల్లో శ్రీకాంత్ పేరు సరిచేస్తామని అతనికి హామీనిచ్చారు.
"బీడీఓ(బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్)కు నా రేషన్ కార్డు ఇచ్చాను. పేరు ఏం ఉందో చదవమన్నాను. ఆయన చదవలేదు. అక్కడి నుంచి పారిపోయారు. ఏం తప్పుచేశారని పారిపోయారు? సాధారణ పౌరులను ఇంకెంత కాలం ఇలా ఇబ్బంది పెడతారు?" అని మండిపడ్డాడు శ్రీకాంత్.