తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tripura Violence: కాంగ్రెస్, వామపక్ష ఎంపీలపై దాడి.. ‘ఎన్నికల తర్వాతి హింస’పై విచారణకు వచ్చిన వారిపై..

Tripura Violence: కాంగ్రెస్, వామపక్ష ఎంపీలపై దాడి.. ‘ఎన్నికల తర్వాతి హింస’పై విచారణకు వచ్చిన వారిపై..

11 March 2023, 9:03 IST

    • Tripura Violence: త్రిపురలో కాంగ్రెస్, వామపక్షాల ఎంపీల బృందంపై దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై నిజాలను తేల్చేందుకు వచ్చిన వారిపై దాడి జరిగింది.
Tripura Violence: దాడిలో ధ్వంసమైన వాహనం
Tripura Violence: దాడిలో ధ్వంసమైన వాహనం (ANI)

Tripura Violence: దాడిలో ధ్వంసమైన వాహనం

Tripura Violence: త్రిపురలో కాంగ్రెస్ (Congress), వామపక్షాలకు (Left Parties) చెందిన ఎంపీలపై దాడి జరిగింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల (Tripura Elections) ఫలితాల తర్వాత జరిగిన రాజకీయ హింసపై (Post Poll Violence) నిజాలను తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, వామపక్ష ఎంపీల బృందం శుక్రవారం త్రిపురకు చేరుకుంది. హింసలో నష్టపోయిన బాధితులను కలిసేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఎంపీలు ఆ రాష్ట్రానికి వెళ్లారు. అయితే సిపాహిజాల (Sepahijala) జిల్లాలోని బిశాల్‍గఢ్‍ (Bishalgarh)లో బాధితులను కలిసేందుకు వెళ్లిన ఎంపీల బృందంపై దాడి జరిగింది. ఈనెల 2వ తేదీన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా, మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చింది. అనంతరం రాష్ట్రంలో కొన్ని చోట్ల రాజకీయ హింస చెలరేగింది. దీనిపై నిజ నిర్ధారణ చేసేందుకు ఎంపీల బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది. పూర్తి వివరాలు ఇవే.

బీజేపీ పనే: ఎంపీ ఖాలీద్

Tripura Violence: ఎంపీల బృందంపై దాడికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియలేదని త్రిపుర పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల పనే అని ఎంపీల బృందంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలీద్ ఆరోపించారు. “మా మూడు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఏమీ చేయలేదు. త్రిపురలో చట్టబద్ధమైన పాలన లేదని మేం గ్రహించాం” అని ఏఎన్ఐతో ఆయన అన్నారు.

ఎవరికీ గాయాలు కాలేదు

Tripura Violence: దాడిలో ఎంపీల బృందంలోని ఎవరికీ గాయాలు కాలేదని అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ (IG) జ్యోతిష్మాన్ దాస్ చౌదరీ పేర్కొన్నారు. “వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో బృందం ముందస్తు సమాచారం లేకుండా బిశాల్‍గఢ్‍లోని నేహాల్‍చంద్రనగర్‌కు వెళ్లారు. అక్కడ నినాదాలు చేసిన కొందరు దాడి చేశారు. బృందానికి చెందిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి సభ్యులను సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే రెండు, మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి” అని చౌదరీ తెలిపారు. దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని పట్టుకున్నట్టు తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చేస్తున్నట్టు వెల్లడించారు.

త్రిపురలోని మోహన్‍పూర్‌లో కూడా ఎంపీల బృందాన్ని కొందరు అడ్డుకున్నారు.

దాడి చేసింది బీజేపీనే: జైరామ్ రమేశ్

Tripura Violence: ఈ దాడికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ నేతల బృందంపై త్రిపురలోని బిశాల్‍గఢ్, మోహన్‍పూర్‌లో బీజేపీ గూండాలు దాడి చేశారు. ప్రతినిధుల బృందంలో ఉన్న పోలీసులు ఏమీ చేయలేదు. అక్కడ రేపు బీజేపీ విజయోత్సవ ర్యాలీ చేయనుంది” అని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.

Tripura Violence: అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుకు చెందిన వామపక్షాలు, కాంగ్రెస్‍కు చెందిన కొందరు లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలు.. త్రిపురకు వచ్చారు. మార్చి 2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత త్రిపురలో జరిగిన హింస గురించి నిజాలు తెలుసుకునేందుకు ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. ఎంపీలు మూడు బృందాలుగా ఏర్పడి సిపాహిజాల, గోమతి, వెస్ట్ త్రిపుర, ఖోవై, దలాయ్ జిల్లాల్లో పర్యటించాలని భావించారు. అంతలోనే ఆ దాడి జరిగింది.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గత నెల జరగగా.. ఈనెల 2వ తేదీన ఫలితాలు వచ్చాయి. 60 స్థానాలకు గాను 32 చోట్ల గెలిచిన బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. సీపీఎం 11 స్థానాలకే పరిమితమైంది.