Karnataka Elections Survey: కర్ణాటకలో మళ్లీ ‘హంగ్’: తేల్చిన సర్వే.. ఈసారి కూడా ‘ట్విస్టులు’ తప్పవా!
05 January 2023, 13:06 IST
- Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా ఆ రాష్ట్రంలో హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. దీంతో మరోసారి కర్ణాటకలో ఉత్కంఠ తప్పేలా కనిపించడం లేదు.
Karnataka Elections Survey: కర్ణాటకలో మళ్లీ ‘హంగ్’: తేల్చిన సర్వే.. ఈసారి కూడా ‘ట్విస్టులు’ తప్పవా!
Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్, మే మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సౌత్‍ఫస్ట్ - పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడయ్యయాయి. ఈ సర్వేను బట్టి చూస్తే 2018 సీన్ మళ్లీ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటకలో ఎన్నో ట్విస్టులు జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. ముందుగా భారతీయ జనతా పార్టీ (BJP) అధికారం చేపట్టింది. మూడు రోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కాంగ్రెస్ -జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 14 నెలల తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, బీజేపీకి మళ్లీ అధికారం దక్కడం, ముఖ్యమంత్రి మారడం ఇలా ఒకటేంటి అనేక మలుపులు తిరిగాయి. మొత్తానికి మళ్లీ ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని పీపుల్స్ పల్స్ ట్రాకర్‌పోల్స్ సర్వే తేల్చింది. ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.. కర్ణాటక ఓటర్ల నాడి ఎలా ఉందో ఆ సర్వే వెల్లడించింది. పూర్తి వివరాలు ఇవే.
కాంగ్రెస్ టాప్.. అయినా హంగ్
సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్‍సైట్ కోసం సిస్రోతో కలిసి పీపుల్స్ పల్స్ సంస్థ… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ రాష్ట్రంలో ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. 2022 డిసెంబర్ 15 నుంచి 31 మధ్య ఈ సర్వే చేసింది. ఈ ఏడాది విధానసభ ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది. 101 స్థానాలు సాధించి కాంగ్రెస్ మరోసారి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, అధికార బీజేపీకి 91 సీట్లు, జేడీఎస్‍కు 29 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ తప్పదని ఈ సర్వే తేల్చింది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టేందుకు 113 సీట్లు గెలవడం అవసరం. మొత్తంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని ఈ సర్వే తేల్చింది.
Karnataka Elections 2023: పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్స్ సర్వే ఫలితాలు
కాంగ్రెస్: 101 స్థానాలు
బీజేపీ: 91 స్థానాలు
జేడీఎస్: 29 స్థానాలు
కాంగ్రెస్‍కు మరింత ఓటింగ్ శాతం
ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍కు 40 శాతం, జీజేపీకి 36 శాతం, జేడీఎస్‍కు 18 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ పోల్స్ సర్వే వెల్లడించింది. 2018 (78)తో పోలిస్తే కాంగ్రెస్‍కు అదనంగా మరో 22 సీట్లు వస్తాయని, 2 శాతం ఎక్కువ ఓట్లు దక్కించుకుంటుందని సర్వే పేర్కొంది. గత ఎలక్షన్‍తో పోలిస్తే బీజేపీ 0.2 శాతం తక్కువగా ఓటింగ్ దక్కించుకుంటుందని చెప్పింది. 13 స్థానాలను కోల్పోతుందని అంచనా వేసింది. 2018లో బీజేపీకి 104 సీట్లు దక్కాయి. 2018లో 222 స్థానాలకే ఎన్నికలు జరిగాయి.
కింగ్‍మేకర్.. జేడీఎస్
2018 ఎన్నికల తర్వాత జేడీఎస్ కింగ్ మేకర్‌గా నిలిచింది. ఆ ఎన్నికల్లో 37 స్థానాలే దక్కినా.. ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆ పార్టీ అధ్యక్షుడు కుమార స్వామి కైవసం అయింది. అతిపెద్ద పార్టీగా ఉన్నా సరే కాంగ్రెస్.. ఆయనకే సీఎం పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇక, పీపుల్ పోల్స్ సర్వేను బట్టి చూస్తే జేడీఎస్ ఈసారి కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్ మద్దతు ఇచ్చిన పార్టీనే మళ్లీ అధికారంలో వచ్చేలా ఉంది. 2018తో పోలిస్తే ఈసారి జేడీఎస్ 8 స్థానాలను, 2.8 ఓటింగ్ శాతాన్ని కోల్పోతుందని, అయినా ఆ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతుందని పీపుల్ పోల్స్ సర్వే వెల్లడించింది.
సీఎంగా ఎవరికి మొగ్గు
ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉండాలని కర్ణాటకలోని 28 శాతం మంది కోరుకుంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. 19 శాతంతో ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై, 18 శాతంతో కుమార స్వామి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
గ్రామీణం.. హస్తందే
కర్ణాటకలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. గ్రామీణంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ 8 శాతం ఎక్కువ ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. అధికార బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఒక శాతం ఓటింగ్ పెరుగుతుందని చెప్పింది.
కర్ణాటక ఎన్నికల్లో ఓబీసీలు, మాదిగలు, హోలియా, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌పార్టీకి ఎక్కువగా మద్దతిస్తున్నారని పీపుల్స్ పోల్స్ సర్వే వెల్లడించింది. బీజేపీకి అగ్రవర్ణాలు, లింగాయత్‍ల్లో మద్దతు ఎక్కువ ఉందని పేర్కొంది. వొక్కలిగులు ఎక్కువగా జేడీఎస్‍కు జై కొడతారని పీపుల్స్‌పల్స్ సర్వే స్పష్టం చేసింది.
రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని 38 శాతం కర్ణాటక ప్రజలు అభిప్రాయపడుతున్నారని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో బీజేపీకి 36 శాతం, జేడీఎస్‍కు 18 శాతం మంది మద్దతు తెలిపారని పేర్కొంది. అధికార బీజేపీకి మళ్లీ అధికారమిస్తామని 41 శాతం మంది చెప్పగా.. 51 శాతం మంది ఛాన్స్ ఇవ్వబోమని అన్నారని సర్వేలో తేలింది. హంగ్ ఏర్పడితే కాంగ్రెస్-జేడీఎస్ జతకట్టాలని 41 శాతం మంది, బీజేపీ-జేడీఎస్ కూటమిగా ఏర్పడాలని 38 శాతం మంది చెప్పారని సౌత్ ఫస్ట్ - పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది.
జేడీఎస్ ఎటువైపు?
కర్ణాటక ఎన్నికల్లో ఈసారి హంగ్ ఏర్పడితే జేడీఎస్ ఏ పార్టీకి మద్దతిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీతోనే జేడీఎస్ జట్టు కట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తిరుగుతున్నారు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి. దీంతో కర్ణాటకలో కషాయ పార్టీ జేడీఎస్ మద్దతునిచ్చేలా కనిపించడం లేదు. అయితే మెజార్టీకి దగ్గర్లోకి వస్తే కమల దళం ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
2018 తర్వాత ముఖ్యమైన మలుపులు
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ తరఫున యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, సుప్రీం ఆదేశాలతో అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయి.. మూడు రోజుల్లోనే రాజీనామా చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా కుమార స్వామి పీఠం ఎక్కారు. అయితే 14 నెల తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలోని 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీకి మద్దతు పలికారు. దీంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బీజేపీ మళ్లీ అధికారం చేపట్టింది. యడ్యూరప్ప మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొంతకాలానికి యడ్యూరప్పను సాగనంపిన బీజేపీ.. బస్వరాజు బొమ్మైను ముఖ్యమంత్రిని చేసింది.