తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitish Kumar: కేసీఆర్ ‘జాతీయ సభ’పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మీటింగ్ అంటూ..

Nitish Kumar: కేసీఆర్ ‘జాతీయ సభ’పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మీటింగ్ అంటూ..

19 January 2023, 17:34 IST

    • Bihar CM Nitish Kumar on KCR Rally: జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత చాటాలనే భావనతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సభను తక్కువ చేసి మాట్లాడారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. అది బీఆర్ఎస్ పార్టీ సభ అన్నారు. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar: కేసీఆర్ ‘జాతీయ సభ’పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు (PTI)
Nitish Kumar: కేసీఆర్ ‘జాతీయ సభ’పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు (PTI) (HT_PRINT)

Nitish Kumar: కేసీఆర్ ‘జాతీయ సభ’పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు (PTI)

Bihar CM Nitish Kumar on KCR Rally: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి సభపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఓ మాజీ సీఎం, జాతీయ నేతలు పాల్గొన్న సభను.. పార్టీ మీటింగ్ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. 2024 లోక్‍సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి సారథ్యం వహించాలని ఆశిస్తున్న నితీశ్ కుమార్.. కేసీఆర్ సభపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్‍టాపిక్‍గా మారింది. నితీష్ ఏమన్నారంటే..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో విపక్షాలను ఐక్యం చేసే దిశగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లక్ష్యాలను ప్రకటించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ఖమ్మంలో భారీ సభ నిర్వహించారు. ఢిల్లీ మఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. అయితే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‍ ఈ సభకు రాలేదు.

సభ గురించి తెలియదు

Bihar CM Nitish Kumar on KCR Rally: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‍ను కేసీఆర్ నిర్వహించిన ప్రతిపక్షాల సభకు ఆహ్వానించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, తాను వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని, అసలు సభ గురించే తనకు తెలియదని జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం బిహార్‌లోని జిల్లాల్లో సమాధాన్ యాత్ర పేరుతో ప్రజల మధ్యకు వెళుతున్నారు నితీశ్. “కేసీఆర్ నిర్వహించిన సభ గురించి నాకు తెలియదు. వేరే పనుల్లో నేను బిజీగా ఉన్నా. ఆయన పార్టీ సభకు ఆహ్వానం అందిన వారు తప్పకుండా వెళ్లాలి” అని నితీశ్ కుమార్ అన్నారు. “అది ఓ పార్టీకి చెందిన ర్యాలీ.. అక్కడికి కొందరిని ఆహ్వానించారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ప్రతిపక్షాల ఐక్యతను చాటే లక్ష్యంతో కేసీఆర్ నిర్వహించిన సభను పార్టీ సభగా నితీశ్ అభివర్ణించారు.

నా కల అదే

Bihar CM Nitish Kumar: బీజేపీ నుంచి బయటికి వచ్చి మహాగఠ్బంధన్ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత గురించి నితీశ్ మాట్లాడుతున్నారు. మరోసారి ఆ స్వరాన్నే వినిపించారు. “నేను చెబుతూనే ఉన్నా. నా కోసం నాకు ఏమీ వద్దు. నాకు ఓ కల ఉంది - ప్రతిపక్ష నేతలు ఏకమై, పోరాడడం చూడాలని కోరుకుంటున్నా. అది దేశానికి మంచి చేస్తుంది” అని నితీశ్ కుమార్ అన్నారు. విపక్షాల ఐక్యం చేసే కృష్టిని కేసీఆర్ సభ నిరుత్సాహపరచదని నితీశ్ వ్యాఖ్యానించారు.

2024 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్సేతర విపక్షాల కూటమికి కేసీఆర్ సభే అతిపెద్ద ముందడుగుగా ఉంది.

‘కేసీఆర్ ర్యాలీతో నితీశ్ కల చెదిరింది’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వల్ల ప్రధాని కావాలాన్న నితీశ్ కుమార్ కలలకు ఎదురుదెబ్బ తగిలిందని బీజేపీ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్ అన్నారు. “ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు నిర్వహించిన సభకు భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నితీశ్‍ను ఆహ్వానించాలని కూడా ఆలోచించలేదు. దీంతో ఆయన (నితీశ్) కల చెదిరింది” అని ప్రసాద్ చెప్పారు.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పేర్కొంటున్నప్పటి నుంచి.. నితీశ్ కుమార్ మూడో ఫ్రంట్ ఆలోచన చేస్తున్నారని ప్రసాద్ చెప్పారు. ప్రతిపక్షాలతో ప్రత్యామ్నాయ కూటమికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. “ప్రధాని అభ్యర్థిగా తనను తాను చూపించుకోవాలన్న నితీశ్ కుమార్ లక్ష్యాన్ని కేసీఆర్ సభ చెరిపివేసింది” అని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్.. బిహార్ పర్యటనలో హైడ్రామా

గతేడాది ఆగస్టులో బిహార్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే 2024 లోక్‍సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సవాలు విసరగిలిగే నేతగా నితీశ్‍ను భావిస్తున్నారా అనే ప్రశ్న కేసీఆర్‌కు ఎదురైంది. అయితే నిర్ణయం తీసుకునేది తాను కాదని, ప్రతిపక్షాలన్నీ చర్చించుకున్నాక డిసైడ్ అవుతామని అన్నారు. దీంతో కేసీఆర్ మాట్లాడుతుండగానే.. నితీశ్ కుమార్ సీటులో నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కూర్చోవాలని నితీశ్‍ను కోరారు కేసీఆర్. అయితే ఇక వెళదామంటూ నితీశ్ పట్టుబట్టారు. అప్పట్లో ఈ హైడ్రామా.. హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కేసీఆర్ సభను నితీశ్.. తక్కువ చేసి చూపడం ఆసక్తికరంగా మారింది.