BRS will fight against Privitisation : ప్రైవేటీకరణపై పోరాడతామన్న కేసీఆర్…
BRS will fight against Privitisation భారత రాష్ట్ర సమితి విధివిధానాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని పార్టీ జాతీయాధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మం వేదికపై ప్రకటించారు. బిఆర్‌ఎస్ అజెండా రూపకల్పన కోసం మేధావులు, మాజీ న్యాయమూర్తులు కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ముసాయిదాను ప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు. తెలంగాణ తరహాలో దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని, ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసినా అధికారంలోకి వచ్చాక వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. దేశమంతటా ఉచిత విద్యుత్ అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
BRS will fight against Privitisation భారత దేశం లక్ష్యాన్ని కోల్పోయిందని, దారి తప్పి, బిత్తరపోయిన స్థితిలో దేశం ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో లక్షల కోట్ల రుపాయల సహజ సంపద ఉందని, అయినా విదేశాల ముందు యాచకులు కావాల్సి వస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
అమెరికా విస్తీర్ణం భారత దేశం కంటే రెండున్నర రెట్లు పెద్దగా ఉన్నా వారి వ్యవసాయ భూమి 29శాతం, చైనా వ్యవసాయ భూమి శాతం 16శాతం మాత్రమేనని భారతదేశంలో మాత్రమే 50శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉందన్నారు. ఏటా లక్షా 40వేల టిఎంసిల వర్షపాత ఏటా కురుస్తోందని, 75వేల టిఎంసిల నీటిని ఉపయోగించుకోగలిగే పరిస్థితులు ఉన్నా వాడుకోలేకపోతున్నామన్నారు.
దేశంలో విభిన్న అగ్రిక్లైమాటిక్ జోన్‌లు దేశంలో ఉన్నాయని, ఇతర దేశాల్లో ఆ పరిస్థితులు ఉండవన్నారు. కష్టపడి పనిచేసే 39కోట్ల జనాభా ఉన్న దేశంలో మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లను తినే పరిస్థితి ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ ఛైన్‌గా ఉండాల్సిన దేశంలో కందిపప్పు, పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడం సిగ్గు చేటు కదా అని ప్రశ్నించారు. 75వేల టిఎంసిల వాడుకోడానికి అందుబాటులో ఉంటే 20వేల టిఎంసిలకు మించి వాడుకోలేకపోవడానికి కారకులు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశానికి ఎలాంటి లక్ష్యం లేకుండా పోవడానికి కారకులు ఎవరన్నారు. కృష్ణా జలాల వివాదం మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసి 20ఏళ్లు దాటినా ఎందుకు తీర్పు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. మంచినీరు ఇవ్వడం చేతి కాని ప్రభుత్వాలు, ప్రజల్ని మభ్య పెట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. బక్కెట్ నీరు కోసం చెన్నై నగరం అల్లాడుతున్న మనకు ఎందుకు సిగ్గు రావడం లేదన్నారు. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకని ప్రశ్నించారు. మహానది జలాలు కోసం ఒడిషా, చత్తీస్‌గడ్, సట్లేజ్ నదీ జలాల కోసం పంజాబ్-హర్యానాలు , గోదావరి, కృష్ణా జలాల కోసం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు, కావేరి జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలు ఎన్నాళ్లు గొడవలు పడాలన్నారు.
దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్….
దేశంలో రాష్ట్రాల మధ్య వివాదాల యుద్ధాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందుదొందే అని విమర్శించారు. ఎవరు అధికారంలో ఉంటే మరొకరిని తిట్టడం తప్ప సాధించింది ఏమి లేదన్నారు. దేశంలో నాలుగు లక్షల పదివేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని, 2లక్షల మెగావాట్లకు మించి దేశంలో వాడకంలో లేదన్నారు. దేశమంతటా కరెంటు కోతలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా 24గంటలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బిఆర్‌ఎస్ వంటి భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లో కరెంటు కష్టాలను తీరుస్తామన్నారు. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేశంలో నిత్యం వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. 13-14లక్షల కోట్లు ఎన్‌పిఏల పేరుతో దోచిపెట్టారని, ప్రభుత్వ రంగ ఆస్తులను కొందరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తరహాలో దేశ వ్యాప్తంగా ఉచిత కరెంటు అందిస్తామన్నారు.
త్వరలో విధివిధానాలు ఖరారు….
తెలంగాణ రైతు బంధు తరహా పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందన్నారు. నష్టాలను సమాజంపై రుద్ది, లాభాలను ప్రైవేటీకరించాలనే దుర్మార్గమైన విధానాలను బీజేపీ అమలు చేస్తోందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఎల్‌ఐసి వంటి సంస్థలను విక్రయించినా తాము వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించారు. కరెంటు, మంచినీటిని ఇవ్వలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని బిఆర్‌ఎస్ రద్దు చేస్తుందని చెప్పారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రగతి శీల రాజకీయ పార్టీలతో బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని, అంతిమ విజయం తమదేనన్నారు. పార్టీ విధివిధానాలను మేధావులు, మాజీ న్యాయమూర్తులు రూపొందిస్తున్నారని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామన్నారు.
ఖమ్మం జిల్లాపై కేసీఆర్ వరాలు…..
ఖమ్మం జిల్లాలో 589 గ్రామపంచాయితీలుంటే ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షల రుపాయలు సిఎం సహాయ నిధి నుంచి అందిస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. కల్లూరు, ఎదులాపురం, పదివేల జనాభాకు మించి ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలకు పదికోట్ల రుపాయలు అభివృద్ధి నిధులు ప్రకటించారు. ఖమ్మం మునిసిపాలిటీకి 50కోట్ల నిధులు ప్రకటించారు. మున్నేరు నది మీద పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ప్రకటించారు. సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపాలిటీలకు 30కోట్ల చొప్పున నిధులు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాన్ని నెలరోజుల్లో కేటాయించాలని అధికారులకు సూచించారు.